
తాడికొండ: అమరావతి ఆంధ్రుల సొత్తయితే, ఈ ప్రాంతంలో దళితులు, ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పించకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని అమరావతి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 49వ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బినామీలతో భూములు స్వాహాచేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు.. ఇళ్ల స్థలాల కోసం దీక్షలకు వస్తున్న దళిత మహిళలపై దాడులు చేసి బెదిరించి ట్రాక్టర్లతో తొక్కిస్తామనడంపై మండిపడ్డారు. అణగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున లేచి చంద్రబాబు అండ్ కోను ముంచెత్తుతామని హెచ్చరించారు.
పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు
దళిత నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనరాజు మాట్లాడుతూ మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు తన కుల రాజధాని నిర్మాణానికి కృత్రిమ ఉద్యమంతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు చంద్రబాబు వత్తాసు పలుకుతూ..ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకెక్కి వ్యవస్థను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజాబలం, దళిత, మైనారీ్ట, బీసీ వర్గాల అండ ఉందని స్పష్టం చేశారు. కాగా బుధవారంతో రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దళిత, బహుజన సంఘాలు భారీగా పాల్గొని మద్దతు తెలుపనున్నాయి. బేతపూడి సాంబయ్య, ఆదాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment