శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో విద్యార్థుల భారీ బైక్ ర్యాలీకి జెండా ఊపుతున్న స్పీకర్ తమ్మినేని
ఆమదాలవలస: విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం విద్యార్థులు ఉద్యమించారు. రియల్ ఎస్టేట్ రాజధాని తమకు వద్దని.. మూడు రాజధానులే ముద్దంటూ నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా సోమవారం విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విదార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వీడి.. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే.. విశాఖ రాజధాని అయితేనే సాధ్యమంటూ గొంతెత్తారు. బైక్ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ ప్రాంగణానికి చేరుకుంది.
రాజధానిని సాధించే వరకూ పోరాటం ఆగదు : స్పీకర్ తమ్మినేని సీతారాం
సభలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసుకునే వరకూ పోరాటం ఆపొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాజధాని సాధన అన్నది ఉత్తరాంధ్ర ప్రజలందరి బాధ్యతని చెప్పారు. భావి తరాల కోసమే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని.. దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు.
ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకనుగుణంగా న్యాయమూర్తులు సహకరించి.. రాజధానుల నిర్మాణాలకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్రకు విస్తృతంగా పరిశ్రమలొస్తాయని, తద్వారా యువతకు మెండుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగి.. వలసలు ఆగిపోతాయని స్పీకర్ వివరించారు. తొలుత వైఎస్సార్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి స్పీకర్ నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment