
మాట్లాడుతున్న రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి
తిరుపతి రూరల్: శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) అధ్యక్షుడు రఫీహిందూస్థానీ అధ్యక్షతన తిరుపతి యూత్ హాస్టల్లో ‘మూడు రాజధానులు – వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీమ ప్రాంతానికి చెందిన పలువురు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత ఈ సమావేశంలో పాల్గొని సీమ ఆకాంక్షను వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు అడగకున్నా స్వార్థం కోసమే గత పాలకులు అమరావతి పేరుతో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ముందుగానే లీకులివ్వడంతో వందలాది ఎకరాలను గత పాలకులు మింగేశారని ఆరోపించారు. స్థిరమైన నగరాల్లోనే రాజధానిని అభివృద్ధి చేయాలని ఎస్వీయూ ప్రొఫెసర్ కృష్ణమోహనరెడ్డి కోరారు. అమరావతి ప్రాంత రైతులను టీడీపీ మోసం చేసి.. వారిని రోడ్డుపాల్జేసిందంటూ మండిపడ్డారు. రాయలసీమ రాజధాని ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు.
ఏ కమిటీ కూడా అమరావతిలోనే రాజధానిని పెట్టాలని సూచించిన దాఖలాల్లేవని సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ తెలిపారు. రాయలసీమకు వచ్చి సీమ వాసులు ఏర్పాటు చేసుకున్న మూడు రాజధానుల ఫ్లెక్సీలను చించిన దౌర్జన్యకారులకు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలకడం దారుణమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆప్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ, గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షుడు శంకరనాయక్, సాహిత్య అకాడమీ కన్వీనర్ డాక్టర్ మస్తానమ్మ, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment