మాకు మళ్లీ పాతరోజులు వచ్చాయంటూ నాటుతుపాకులతో టీడీపీ నేతల బరితెగింపు
‘అనంత’లో మళ్లీ రక్తచరిత్రకు శ్రీకారం!?
రామగిరి, మడకశిరలోటీడీపీ నేతలు కత్తులు,నాటు తుపాకులతో బెదిరింపులు
గణేశ్ ఉత్సవాల్లో ఆయుధాలతో విచ్చలవిడిగా డ్యాన్సులు
ఈనెల 9న పుట్టపర్తి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ‘నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా.. రక్తచరిత్ర.. రక్త చరిత్ర..’ అంటూ పాటలు వేసుకుని టీడీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా డ్యాన్సులు చేశారు. ఇవి చూసి భక్తజనం బెంబేలెత్తిపోయారు.
ఈనెల 10న రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో టీడీపీ కార్యకర్త గంగాధర్ నాటు తుపాకీతో నానా హంగామా చేశాడు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత కేశవపై దాడి చేయబోయాడు. అతను అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
ఈనెల 11న మడకశిర మండలం గుండుమల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులు బహిరంగంగా కత్తులు, తుపాకీలతో విన్యాసాలు చేశారు. ఇది చూసి జనం బేజారెత్తిపోయారు.
సాక్షి, టాస్‌్కఫోర్స్ : రాయలసీమ జిల్లాల్లో నాటు తుపాకుల సంస్కృతి మళ్లీ ఊపిరిపోసుకుంటోందనడానికి ఈ ఘటనలే తాజా ఉదాహరణలు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకుల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు వీటితో బహిరంగంగా డ్యాన్సులు చేస్తూ చెలరేగిపోతున్నారు. దీంతో ‘ఆర్‌ఓసీ’ రోజులు మళ్లీ దాపురించాయా! అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
నిజానికి.. నాటు తుపాకులు, బాంబులు, కత్తులు.. ఈ మాటలు వింటే ఉమ్మడి అనంతపురంలో జిల్లాలో ఆర్‌ఓసీ (రీఆర్గనైజింగ్ కమిటీ) అరాచకాలు గుర్తుకొస్తాయి. అప్పట్లో టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి నేతృత్వంలో ఈ దారుణాలు విచ్చలవిడిగా సాగాయి. ఇందుకు ఎందరో బలయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ నాటి రోజులు గుర్తొచ్చేలా ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ఉదా.. రామగిరి మండలంలో మాజీమంత్రి పరిటాల సునీత అనుచరులు నాటు తుపాకులతో నానా హంగామా చేస్తున్నారు.
‘మాతో పెట్టుకుంటే అంతే.. కాల్చిపడేస్తాం.. మళ్లీ మాకు పాత రోజులు వచ్చాయి’ అని రెచి్చపోతున్నారు. ఒకచోట గన్ ఘటన వెలుగులోకి రాగానే.. మరోచోట వినాయక నిమజ్జనంలో తుపాకులతో విన్యాసాలు చేశారు. ఇంకోచోట.. రక్తచరిత్ర పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేశారు.
ఐదేళ్లలో అభివృద్ధి పనులు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రామగిరి మండల వ్యాప్తంగా పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కుంటిమద్ది గ్రామంలో కూడా రోడ్లు వేశారు. తాగునీటి సౌకర్యం కలి్పంచారు. ఫలితంగా ఈ ప్రాంతం ఫ్యాక్షన్ ప్రభావం నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ పరిటాల కుటుంబం ఆ గ్రామంలో ఫ్యాక్షన్ వాతావరణానికి ఆజ్యం పోస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
వినాయక చవితి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సి ఉండగా.. గ్రామాల్లో కొందరు టీడీపీ అల్లరిమూకలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా చెలరేగిపోయారు. నాటు తుపాకులు, కత్తులు, డమ్మీ తుపాకులు చూపించి ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదేంటని ప్రశి్నంచిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో మళ్లీ ‘ఆర్‌ఓసీ’ కాలంలో మాదిరిగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని ప్రజలు వణికిపోతున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించం..
తుపాకులు వాడాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అనుమతులు పొందిన వారే వాడాలి. ఎవరుపడితే వారు నాటు తుపాకులతో రెచ్చిపోతే కేసులు తప్పవు. పండుగ వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే సహించేదిలేదు.
– వి. రత్న, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment