టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్వాకంతో హంద్రీ–నీవా నీటి విడుదలకు బ్రేక్
కృష్ణమ్మ కరుణిస్తున్నా కరువు సీమకు అందని నీళ్లు.. పుట్టా సంస్థకు కర్నూలు–గుంటూరు హైవే నిర్మాణ పనులు
గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య వంతెన కోసం హంద్రీ–నీవా కాలువను పూడ్చివేసిన పుట్టా సంస్థ
పైపులు అమర్చకుండా రోడ్డు వేయడంతో నీటి విడుదలకు ఆటంకం.. జలాశయాలు, చెరువులకు నీరు నింపే ఏకైక మార్గం బంద్
‘సీమ’లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి.. పల్లెల్లో 30 లక్షల మందికి తాగునీటి ఇక్కట్లు
కాంట్రాక్టు సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేది కావడంతో రైతుల ఇక్కట్లను పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం
మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన రోడ్డు నిర్మాణ సంస్థ ఈ ఫోటోలో కనిపిస్తున్న హంద్రీ–నీవా కెనాల్‌ను పూడ్చివేసి దీనిపై తాత్కాలిక రహదారిని నిర్మించింది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం కెనాల్‌ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది.
రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కుచెందిన పీఎస్‌కే ఇన్‌ఫ్రా ఈ రహదారి నిర్మాణ పనులను చేస్తోంది. కాలువలో కనీసం పైపులు అమర్చి రోడ్డు నిర్మించినా నీళ్లు పారేవి. ఆ మాత్రం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పుట్టా సంస్థతో పాటు జలవనరులశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించగా నీటి విడుదల నిలిచిపోవటానికి కారణాలు వెల్లడించకుండా రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది.
సాక్షి ప్రతినిధి కర్నూలు: జలవనరులశాఖ నిర్లక్ష్యం, పుట్టా సంస్థ పీఎస్‌కే ఇన్‌ఫ్రా లెక్కలేనితనం వెరసి ప్రభుత్వ వైఫల్యం.. రాయలసీమకు పెనుశాపంగా పరిణమించింది. కళ్లెదుట కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నా, శ్రీశైలం రిజర్వాయర్ నిండటంతో నీళ్లు దిగువకు విడుదలవుతున్నా హంద్రీ–నీవాకు నీళ్లు మళ్లించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తింది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టాది కావడంతో ఇటు అధికారులు, అటు ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉన్నారు.
తాత్కాలిక రోడ్డు వేసే సమయంలోనే కాలువలో నీళ్లు దిగువకు వెళ్లేలా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? 15 రోజులుగా కృష్ణాకు వరద నీరు వస్తున్నా హంద్రీ–నీవాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అని సమీక్షించి అప్రమత్తం కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. సర్కారు నిర్వాకాలతో ఈ ఏడాది ‘సీమ’లో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది.
గత ఐదేళ్లూ ముందుగానే..
గతేడాది రాయలసీమలో వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయితే అదృష్టవశాత్తూ మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర పోటెత్తాయి. శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిగా నిండటంతో ఆరు గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో హంద్రీ–నీవా నీటితో చెరువులు, రిజర్వాయర్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగు చేసుకోవచ్చని సీమ రైతులు ఆశ పడ్డారు.
గత ఐదేళ్లూ పోతిరెడ్డిపాడు కంటే ముందుగానే హంద్రీ–నీవాకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శ్రీశైలంలో నీటిమట్టం 834 అడుగులకు చేరితే హంద్రీ–నీవాకు నీళ్లు విడుదల చేయవచ్చు. ముచ్చుమర్రి ద్వారా 800 అడుగులకే నీరు లిఫ్ట్ చేయవచ్చు. అయితే రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నా ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా, కారణాలు చెప్పకుండా దాగుడు మూతలాడుతోంది. 15 రోజులుగా నీళ్లు విడుదల కాకపోవడంపై రైతన్నలు తీవ్రంగా మథన పడుతున్నారు.
పైపులు వేసి ఉంటే..
కర్నూలు–విజయవాడ నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఎన్‌హెచ్–340 సి రోడ్డు పనుల్లో ఒకటో ప్యాకేజీని పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్‌కే ఇన్‌ఫ్రా దక్కించుకుంది. ఈ ప్యాకేజీలో 30.6 కి.మీ. నాలుగు లేన్ల రహదారిని రూ.827.39 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో గార్గేయపురం, బ్రాహ్మణ కొట్కూరు మధ్య హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మించాలి. దీంతో కాలువపై ఉన్న కల్వర్టు తొలగించి వంతెన నిర్మిస్తున్నారు.
రాకపోకల కోసం హంద్రీ–నీవా కెనాల్‌ను పూడ్చేసి తాత్కాలిక రోడ్డు వేశారు. పైపులు వేసి రోడ్డు నిర్మిస్తే కాలువలో నీటి ప్రవాహానికి వీలుండేది. 15 రోజుల క్రితమే హంద్రీ–నీవా నీళ్లు విడుదలయ్యేవి. పీఎస్‌కే ఇన్‌ఫ్రా నిర్లక్ష్యంగా వ్యవహరించి పైపులు వేయకుండా కాలువను పూర్తిగా పూడ్చేసింది. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు.
హంద్రీ–నీవాపై ఆధారపడ్డ 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు
‘హంద్రీ–నీవా సుజల స్రవంతి’పై ఆధారపడి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జిల్లాలలో 30 లక్షలమందికి తాగునీరు అందుతోంది. క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్ల కింద వందల చెరువులకు ఏటా నీళ్లు ఇస్తున్నారు. 76 చెరువులకు గత ప్రభుత్వం నీరందించింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ కుప్పానికి కూడా హంద్రీ–నీవా నీటిని విడుదల చేశారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కృష్ణాలో నీళ్లున్నా విడుదల చేయకుండా అన్నదాతలతో పరిహాసమాడుతోంది. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను 120 రోజుల పాటు ఎత్తిపోసేలా పథకాన్ని డిజైన్ చేశారు. అయితే అన్ని రోజులు కృష్ణాలో ప్రవాహం ఉండటం లేదు. దీంతో కెనాల్‌ను విస్తరించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో 15 రోజుల ముందే నీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి సారించకపోవడంతో ‘సీమ’కు తీవ్ర నష్టం జరుగుతోంది.
రోడ్డు తొలగించి నీటిని విడుదల చేస్తాం
జాతీయ రహదారి పనుల్లో భాగంగా హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మాణం జరుగుతోంది. నీటిని విడుదల చేసే లోపు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక రోడ్డు వేశారు. అయితే సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారు. గడువు దాటితే ఏజెన్సీతో పని లేకుండా రోడ్డు తొలగించి, పూడిక తీసేసి నీటిని విడుదల చేస్తాం. – రామగోపాల్, ఎస్‌ఈ, హంద్రీ–నీవా సుజల స్రవంతి
ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాం
పీఎస్‌కే ఇన్‌ఫ్రా హంద్రీ కాలువపై వంతెనను నిర్మిస్తోంది. కాలువను నిర్మాణ సంస్థే పూడ్చింది. నీటి విడుదల కోసం జలవనరులశాఖ అధికారులు తాత్కాలిక రోడ్డును తొలగించే యోచనలో ఉన్నారు. ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాం. – జి.గోవర్ధన్, పీడీ, నేషనల్ హైవేస్ అథారిటీ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment