యుద్ధ ప్రాతిపదికన పనులు
టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సంస్థ కాలువను పూడ్చిన రోడ్డు పక్కన మరో దారి నిర్మాణం
రాత్రి మొత్తం పనులు.. పర్యవేక్షిస్తున్న అధికారులు
మల్యాలలో మోటార్లు ఆన్ చేసి నీటి విడుదలకు ఏర్పాట్లు
చిన్న పైపులతో 500 క్యూసెక్కులకు మించి ప్రవహించడం కష్టమే
3,850 క్యూసెక్కుల కాల్వ సామర్థ్యంతో పోలిస్తే అవి ఏ మూలకు?
కృష్ణమ్మ పోటెత్తినా 15 రోజులుగా నీళ్లివ్వకుండా తీవ్ర తాత్సారం
సాక్షి ప్రతినిధి కర్నూలు: టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యానికి, కూటమి సర్కారు నిర్వాకాలకు రాయలసీమలో దాదాపు 6.02 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన సంస్థ కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.
గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం పుట్టా సంస్థ కెనాల్‌ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది. కాలువను పూడ్చేటప్పుడు నీళ్లు వెళ్లేందుకు వీలుగా పైపులు వేయకుండా అప్రోచ్ రోడ్డు నిరి్మంచారు. దీంతో రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది.
రాత్రి కూడా పనులు.. నేడు నీటి విడుదల
‘పుట్టా పాపం.. సీమకు శాపం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో జలవనరులశాఖ అధికారులు ఉదయమే హంద్రీ–నీవా కెనాల్ వద్దకు చేరుకుని ప్రత్యామ్నాయాలు అన్వేíÙంచారు. ప్రస్తుతం కాలువ పూడ్చిన ప్రాంతం పక్కనే చిన్న సైజు సిమెంట్ పైపులు వేసి దానిపై రోడ్డు వేయాలని నిర్ణయించారు. రాత్రి పూట కూడా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించి గురువారం ఉదయానికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 11 గంటలకు మల్యాల వద్ద మోటార్లు ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
స్వల్ప ప్రవాహం ‘అనంత’కు చేరేదెలా?
హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు కాగా లైనింగ్ లేనందున 2,300–2,500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తాయి. అయితే ఇప్పుడు పుట్టా సుధాకర్ సంస్థ తాత్కాలికంగా అమరుస్తున్న పైపుల ద్వారా 500 క్యూసెక్కులకు మించి ప్రవహించవని అధికారులు చర్చించుకుంటున్నారు. కాలువను పూడ్చి అప్రోచ్ రోడ్డు నిరి్మంచే సమయంలోనే పెద్ద పైపులు వేసి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు.
15 రోజులుగా నీళ్లు వదలకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు తాపీగా చిన్న సైజు పైపులు వేస్తున్నారు. పెద్ద పైపులు వేసి ఉంటే 1000–1500 క్యూసెక్కులు ప్రవహించే వీలుండేదని నీటి పారుదలశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. దీంతో నీళ్లు విడుదల చేసినా స్వల్ప ప్రవాహం కర్నూలులోని క్రిష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్లను దాటి అనంతపురం జిల్లాకు చేరే అవకాశం కనిపించడం లేదు.
కాస్త ఆలస్యంగానైనా ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించింది. ఎగువ నుంచి పోటెత్తిన వరద ఉధృతితో శ్రీశైలం నిండుకుండలా మారింది. శ్రీశైలంలో 834 అడుగులకే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా కళ్లప్పగించి చూసింది. రిజర్వాయర్‌లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు వదులుతున్నా హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేసే మల్యాల పంప్‌లను ఇప్పటిదాకా ఆన్ చేయలేదు.
నాడు రిజర్వాయర్లు కళకళ..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉండగా హంద్రీ–నీవా ద్వారా 2020లో 47.34 టీఎంసీలు, 2021లో 45.65 టీఎంసీలు విడుదల చేశారు. నీటిని ఒడిసిపట్టి రైతుల సంక్షేమాన్ని కాంక్షించారు. నాడు ‘సీమ’లో చెరువులన్నీ నిండి రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడాయి. ఇప్పుడు చిన్నసైజు పైపులతో 500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తే సీజన్ మొత్తంలో కనీసం 5 టీఎంసీలు కూడా నీటిని డ్రా చేయలేని దుస్థితి కనిపిస్తోంది.
నీళ్లున్నా ఎందుకీ నిర్వాకం?
చంద్రబాబు పాలనలో ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం జీవో 22 జారీ చేసింది. దీంతో కళ్లెదుట నీళ్లు పారుతున్నా రైతులు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా శ్రీశైలంలో నీళ్లు ఎక్కువై పది గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నా దుర్భిక్ష ‘సీమ’కు అందని దుస్థితి ఉత్పన్నమైంది.
రోడ్డు నిర్మాణ ప్రాంతంలో కాలువ సామర్థ్యం మేరకు పైపులైన్లు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించి ఉంటే పుట్టా సుధాకర్ సంస్థ ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సి వచ్చేది. పెద్ద పైపులైన్లు వేస్తే 2 వేల క్యూసెక్కులకు తగ్గకుండా ప్రవాహం దిగువకు వెళ్లేది. అన్నదాతల ఇక్కట్లపై వైఎస్సార్ సీపీ తక్షణమే స్పందించి నిలదీయడంతో ఇక తప్పించుకునే అవకాశం లేక కంటి తుడుపు చర్యలు చేపట్టారు. దీంతో హంద్రీ–నీవా నీటి కోసం రైతు సంఘాలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment