మీడియాతో మాట్లాడుతున్న రాయలసీమ మేధావుల ఫోరం నాయకులు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాజధాని నిర్మాణంపై హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును యథావిధిగా అమలు చేయడం వల్ల రాయలసీమకు రాజధాని, హైకోర్టు, కీలక కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న న్యాయమైన ఆకాంక్ష తీరకుండా పోతుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి అన్నారు. ఎస్వీయూలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఎంపిక సమయంలో మాజీ సీఎం చంద్రబాబు ఏకపక్షంగా.. ఒక వర్గానికి మేలు జరిగేలా వ్యవహరించారన్నారు.
1872 కాంట్రాక్టు యాక్టు, విభజన చట్టం ప్రకారం రాజధాని ఎంపిక జరగలేదన్నారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని, రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను రాజధాని ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తాను ముందు అనుకున్న నిర్ణయం మేరకు రాజధానిని ఎంపిక చేశారన్నారు. ఇది విభజన చట్టానికి వ్యతిరేకం కాదా? చట్టం ప్రకారం కేంద్రం ఏ సలహా ఇచ్చింది? శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని ప్రశ్నించారు. ఒప్పంద ప్రయోజనాలు సహజ న్యాయసూత్రాలకు లోబడి ఉండాలన్నారు.
మహానగర నిర్మాణం పేరుతో రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల రైతులతో ఎలా అవగాహన చేసుకుంటారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికలను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో న్యాయమైన భాగస్వామ్యం రాయలసీమకు ఉండేలా తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, మస్తానమ్మ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment