
మాట్లాడుతున్న రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి
సాక్షి,అమరావతి/తిరుచానూరు(తిరుపతి జిల్లా): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ పట్ల చూపుతున్న వివక్షతతో రాయలసీమకు తీవ్ర నీటిగండం ఎదురయ్యే ప్రమాదం ఉందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం ఫోరం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, ప్రయాగతో కలిసి పురుషోత్తంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటన చేస్తూ నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చట్టబద్ధత లేని ఎగువ భద్రను నిలువరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా జాతీయ హోదాను ప్రకటించడం ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని తంగలో తొక్కిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై సమష్టి పోరాటం సాగించాలన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపీకి చెందిన సభ్యులు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కాగా, ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్రపై అదనంగా మరో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దిగువనున్న రాయలసీమలోని తుంగభద్రపై నికర జలాలు కలిగి ఉన్న ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ, కేసీ కెనాల్, గుండ్రేవుల ప్రమాదంలో పడతాయి. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గి తుంగభద్ర నీరే ప్రధానం అవుతున్న నేపథ్యంలో కర్ణాటక నిర్మించే ఎగువ భద్రతో గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment