విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే రెండుసార్లు రాజధానిని కోల్పోయామని, మరోసారి ఇందుకు సిద్ధంగా లేమని రాయలసీమ మేధావుల ఫోరం పేర్కొంది. రాయలసీమకు హైకోర్టు రావాలని, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో రాయలసీమ మేధావుల ఫోరం ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ ప్రయోజనాలు’ అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని, నూతనంగా సమగ్ర అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పారు.
రాయలసీమకు ప్రయోజనాలు కలిగేలా బిల్లులో ఎలాంటి అంశాలు ఉండాలన్న అంశంపై చర్చ జరగాలని అన్నారు. అమరావతి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కూలంకష చర్చ జరగాలని తెలిపారు. అమరావతి రైతులు భూములిచ్చింది వారి ప్రయోజనాల కోసమేనని చెప్పారు. దానిని త్యాగం అంటూ, రాష్ట్రం కోసం అంటూ విచిత్ర వాదనలు తెస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం, రైతులకు ఇవ్వాల్సిన భూమి పోను మిగిలిన భూమి 10 నుంచి 15 వేల ఎకరాల దాకా ఉంటుందన్నారు. అందులో గత ప్రభుత్వం ప్రైవేటు, విదేశీ సంస్థలకు ఇచ్చినప్పుడు అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు 5 వేల ఎకరాల్లో విజయవాడ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు.
అక్కడ పేదల ఇళ్లు ఉంటే వారి ప్లాట్లకు మంచి మార్కెట్ ఉండదనే బెంగే కారణమన్నారు. తీవ్ర కరువు, నీటి సమస్యతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నేడు కావాల్సింది మరో కొత్త నగరంతో కూడిన రాజధాని నిర్మాణం కాదన్నారు. ఉన్న పరిమిత వనరులతో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అవసరమని చెప్పారు. తిరుపతి, హిందూపురం నగరాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పాలన సాగిస్తోందని, అలాంటి సమయంలో అన్ని వ్యవస్థలు ఒకేచోట ఉండాలని కోరుకోవడం సరికాదని అన్నారు. అమరావతి కేంద్రంగా కేంద్రీకృత అభివృద్ది జరిగితే మరో విభజన తప్పదని హెచ్చరించారు. అధ్యాపకులు సుబ్రమణ్యం ఆచారి, హిమబిందు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment