తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు
మూడు రాజధానులకు మద్దతుగా గురువారం తిరుపతిలో ప్రజలు, విద్యార్థులు కదం తొక్కారు. ‘పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి’, ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమంటూ గొంతెత్తారు. గతంలో రాజధానిని వదులుకున్న కర్నూలు ప్రజలదే గొప్ప త్యాగమని నినాదాలు చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు.
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): పరిపాలన వికేంద్రీకరణ – మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, ఎస్‌డీహెచ్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ ఆర్.తిప్పారెడ్డిలతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. అమరావతి వద్దు.. 3 రాజధానులు ముద్దు.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి.. అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 18న నిర్వహించే రాయలసీమ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. అమరావతి ఒక వర్గానికే చెందిన రాజధాని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు.. 13 జిల్లాలని చెప్పారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, అవసరాలను గుర్తించాలని కోరారు. సీమలో ఉన్న కొందరు నాయకులు అమరావతిని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చామని చెపుతున్న అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని.. అది వ్యాపారమని, శ్రీశైలం ప్రాజెక్ట్, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్‌ను ప్రోత్సహిస్తున్నారని పురుషోత్తంరెడ్డి ఆరోపించారు.
కార్యక్రమంలో ఎస్వీయూ ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ఎస్‌డీహెచ్‌ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ డి.రామసునీల్‌రెడ్డి, సీకాం విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్‌రెడ్డి, రచయిత్రి మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment