వికేంద్రీకరణకు సంఘీభావం తెలుపుతున్న వివిధ సంఘాల నేతలు
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణపై కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి అసలు పనికి రాదని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏయూ హిందీ విభాగంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మేధావులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగల్సిందేనని చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. రాజధాని, కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి పాలనకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
అమరావతి కాకుండా వేరే ప్రాంతంలో రాజధాని పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది పాలకుడి నిర్ణయమేనని అన్నారు. ఒక ప్రాంతం మీద అభిమానంతో కాకుండా రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు.
చంద్రబాబు రక్తం మరిగిన పులి
పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి రక్తం రుచి మరిగిన పులి మాదిరిగానే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రవర్తన కూడా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడమే బాబు ధ్యేయమని అన్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి లాభం పొందాలని ఆశిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కాదని, అది ఒక కమ్మ సామాజికవర్గం వ్యాపార సామ్రాజ్యమని అన్నారు.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటివరకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, అందుకు సచివాలయ వ్యవస్థ, జిల్లాల విభజన నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వందలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే రెండు రోజులు పట్టేదని, ఇప్పుడు జిల్లాల విభజనతో వారి చెంతకే కలెక్టరేట్ వచ్చిందన్నారు.
అమరావతి రైతులంతా బడా బాబులే: ప్రొఫెసర్ ఎన్‌ఏడీ పాల్
వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్‌ఏడీ పాల్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఆంధ్రను విభజించినప్పుడు రాజధానికి మొదట విశాఖపట్నమే అనుకున్నా.. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కర్నూలుకు మార్చారన్నారు. ఆ తరువాత హైదరాబా«ద్‌కు మార్చి రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నారు.
ఇప్పుడు కూడా అదేవిధంగా చేయడం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు విద్య, వైద్య, ఉద్యోగావకాశాలు సమానంగా అందుతాయని తెలిపారు. అమరావతి రైతులు అసలు రైతులే కాదని, అంతా బడాబాబులేనని విమర్శించారు. అసలు సిసలైన రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారన్నారు.
వరదలొస్తే అమరావతి కొట్టుకుపోతుంది : ప్రొఫెసర్ ముత్తయ్య
ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ అమరావతి రాజధానిగా అస్సులు పనికి రాదన్నారు. వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. లక్షల కోట్లు వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వాయు, జల, రోడ్డు మార్గాలు ఉన్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని తెలిపారు.
విద్యార్థుల పోరాటాలు విజయవంతం అవుతాయి : ప్రొఫెసర్ పుల్లారావు
ప్రొఫెసర్ పుల్లారావు మాట్లాడుతూ అన్ని ప్రాంతీల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని, ప్రాంతీయ అభిమానంతో కాదని చెప్పారు. విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా విజయవంతం అవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ కోసం విద్యార్థులను భాగస్వామ్యం చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సూర్యనారాయణ, శోభ శ్రీ , నల్ల సత్యనారాయణ, ప్రేమానందం, కృష్ణ, రాజామాణిక్యం, బార్ కౌన్సిల్ సభ్యులు అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment