![Ongoing relay strikes in Amaravati in support of the three capitals - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/19/sad.jpg.webp?itok=7tFIMPCH)
మాట్లాడుతున్న వడిత్యా శంకర్ నాయక్, చిత్రంలో దళిత సంఘాల నేతలు , మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలో పాల్గొన్న మహిళలు
తాడికొండ: పరిపాలన వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కేవలం తమ వర్గం వారి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఆయన ఏనాడూ న్యాయం చేయలేదని దుయ్యబట్టారు.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకుంటున్న ఆయనకు పేదలపై ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ వామపక్షాల నాయకులు పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటూ చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అమరావతి రాజధాని కన్వీనర్ మల్లవరపు నాగయ్యమాదిగ, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పిడతల అభిషేక్, ఎంఏసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాంబయ్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొదమల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment