
దీక్షలో పాల్గొన్న మహిళలు, బహుజన సంఘాల కార్యకర్తలు
తాడికొండ: మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు బుధవారం 57వ రోజుకు చేరుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన బహుజన సంఘాల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అమరావతి భూముల కుంభకోణంలో బినామీల బాగోతం బయటపడుతుందనే భయంతోనే విచారణకు చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజధానిలో నిరుపేదలకు సెంటు భూమి ఇస్తే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా రాజధాని పేరిట జరిగిన అడ్డగోలు దోపిడీ, రివర్స్ టెండరింగ్ ద్వారా బయటపడుతున్న కుంభకోణాలపై ఎందుకు నోరు విప్పడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. చంద్రబాబు ఇకనైనా కుయుక్తులకు స్వస్తి పలికి మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో దళిత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు చెట్టే రాజు, రాజధాని ప్రాంత ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య, నాగార్జునా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడు రుద్రపోగు సురేష్, దళిత నాయకులు ఇందుపల్లి సుభాషిణి, తాళ్లూరి అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment