రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు
తాడికొండ: అమరావతి ఉద్యమం చతికిలపడడంతో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకున్న బాబు.. తనకు అనుకూలంగా ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించడం సిగ్గుచేటని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వమే బంద్‌కు సహకరించి స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూసివేయించిందని, ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారని గుర్తు చేశారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చివరకు మున్సిపల్ ఎన్నికల్లో దిగజారుడు ప్రచారానికి దిగడం సిగ్గుచేటన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసిన దాఖలాలు లేవని, విశాఖపట్నంలో జనం లేక వెలవెలబోయిన ప్రచార సదస్సులకు రూ.500 ఇచ్చి కార్యకర్తలను మీటింగులకు తరలించారని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగబద్ధంగా పేదలకు రావాల్సిన హక్కులను హరించిన చంద్రబాబుకు బహుజనులంతా కలిసి 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు లేకుండా గల్లంతయ్యేలా చేయడం ఖాయమన్నారు. మూడు రాజధానులు, పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, రాజధానిలో 54 వేల ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఉద్యమం విశ్రమించేది లేదని తెలిపారు. నేతలు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, నూతక్కి జోషి, పలు సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment