సమావేశంలో మాట్లాడుతున్న వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక నాయకులు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘రాష్ట్రం సొమ్మంతా తీసుకెళ్లి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. చివరకు కట్టుబట్టలతో పంపారు. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మూడు రాజధానులు ప్రకటిస్తే.. చంద్రబాబు మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం అమరావతే రాజధాని అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అవమానిస్తున్నారు..’ అని వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాకా సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఎ.డి.పాల్ మండిపడ్డారు.
విశాఖలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదని పేదలను ఆదుకుని దేశంలోనే ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పేరిట గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్యకేంద్రాలు, గ్రామరక్షణ వలయం పేరిట అనేక సంక్షేమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
ప్రజలకు ఇంకా చేరువగా పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారని, రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు ఉంటే ప్రజలకు పరిపాలన చేరువవుతుందన్న అభిప్రాయంతో ముందడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో 29 గ్రామాలకు చెందిన కొంతమంది మిడతల దండులా పాదయాత్ర పేరిట బయలుదేరారని ఎద్దేవా చేశారు. శాంతికి నిలయంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాడి చేయడానికి వస్తున్న ఈ దండును అడ్డుకోకపోతే సర్వం నాశనం చేస్తుందని చెప్పారు.
ఆంధ్రా యూనివర్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు, డిఫెన్స్, షిప్‌యార్డ్, నేవల్ డాక్‌యార్డ్, ఎన్‌ఎస్‌టీఎల్, స్టీల్‌ప్లాంట్, రైల్వేస్టేషన్.. ఇలా జల, రోడ్డు, వాయుమార్గాలున్న విశాఖలో పరిపాలన రాజధాని పెడితే చంద్రబాబు అండ్ కోకు బాధ ఎందుకని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి అధిక ఎమ్మెల్యే సీట్లు ఉత్తరాంధ్ర నుంచి పొంది, ఈ రోజున ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు దుర్మార్గమైన చర్యను క్షమించరాదన్నారు.
29 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతగా ఉన్న ఉత్తరాంధ్రలో అశాంతిని సృష్టించడానికి చంద్రబాబు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ప్రొఫెసర్లు కోరుకుంటే.. ఉత్తరాంధ్ర జిల్లాలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీ పాదయాత్రను స్వాగతించడం దారుణమని చెప్పారు. ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఉత్తరాంధ్ర అభివృద్ధిని వద్దనుకుంటున్నారా? అని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment