దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు
తాడికొండ: అమరావతిలో జరిగిన అవినీతిపై నిగ్గుతేల్చేందుకు సీబీఐ, సిట్ కేసులపై ఉన్న స్టేలను ఎత్తివేసి బాబు సహా బినామీలను జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో 147వ రోజు కొనసాగుతున్న దీక్షల్లో పలువురు ప్రసంగించారు. రాజధానిలో రూ.5,370 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించి చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దుబారా చేశాడన్నారు.
బహుజనుల రాజ్యాంగ హక్కులైన ప్రభుత్వ పాఠశాలల్లో పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, రాజధానిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు, మూడు రాజధానులు సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో వేసిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
త్వరలో జరుగనున్న150వ రోజు దీక్షల్లో వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తామని తెలిపారు. కాగా, మంగళవారం కేబినెట్ భేటీలో భాగంగా సచివాలయం వెళుతూ, వస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిలే దీక్షల శిబిరం వద్ద తన వాహన శ్రేణి వేగం తగ్గించి బహుజనులకు అభివాదం చేశారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment