
దీక్షలో మహిళలు, దళిత సంఘాల ప్రతినిధులు
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలే ముఖ్యమా? రాష్ట్ర భవిష్యత్ పట్టదా? అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు నిలదీశారు. మూడు రాజధానులకు మద్దతుగా, శాసన రాజధానిలో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ జంక్షన్‌లో చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 48 రోజుకు చేరుకున్నాయి.
13 జిల్లాల నుంచి తరలివచ్చిన యానాది సంఘాల ప్రతినిధులు దీక్షలో పాల్గొని మద్దతు పలికారు. రాష్ట్ర యానాదుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.ఏడుకొండలు మాట్లాడుతూ రాజధానిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడాన్ని కోర్టుల ద్వారా అడ్డుకోవడం దురదృష్టకరమని, ఇకనైనా టీడీపీ నేతలు బుద్ధి తెచ్చుకుని కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. వికలాంగుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బందెల కిరణ్ మాట్లాడుతూ టీడీపీ, ఇతర పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని రాజన్న ఆటోనగర్ అధ్యక్షుడు పి.ఖాజావలి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్ సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణ చేపడుతుంటే.. టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment