మాట్లాడుతున్న రాయలసీమ అభివృద్ధి అధ్యయన కమిటీ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి
తిరుపతి అర్బన్: ఐకమత్యంతో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతి ఒక్కరూ జైకొట్టాలని రాయలసీమ అభివృద్ధి అధ్యయన కమిటీ పిలుపునిచ్చింది. ఇందుకోసం వచ్చే జనవరిలో మనో చైతన్య యాత్ర పేరుతో శ్రీశైలం లేదా కర్నూలు నుంచి అమరావతి వరకు పెద్దఎత్తున ఉద్యమకారులు, మేధావులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తిరుపతితో శనివారం కమిటీ నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాయలసీమకు జైకొట్టే పార్టీలను పాదయాత్రలో స్వాగతిస్తామన్నారు. జైకొట్టకపోతే ఆ నేతలకు రానున్న రోజుల్లో రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు. సీమ నేతలైన చంద్రబాబునాయుడు, తులసిరెడ్డి, నారాయణ, రామకృష్ణ తదితరులు అమరావతికి జైకొట్టడం సిగ్గుచేటన్నారు. సీమ ప్రజలే ఈ నేతలను వీధుల్లో పడేశారని గుర్తుచేశారు. త్యాగాలకు రాయలసీమ పెట్టింది పేరని అభివర్ణించారు.
68 ఏళ్ల క్రితమే కర్నూలు రాజధానిని త్యాగం చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. అంతేకాదు.. ఆ సమయంలో బళ్లారి నగరంతోపాటు, తుంగభద్ర, కృష్ణ పెన్నా ప్రాజెక్టులను కోల్పోయామన్నారు. భూములకు పరిహారం తీసుకుని.. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని అమరావతి రైతులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని అంశం అమరావతి ప్రజలకే పరిమితం కాదని.. ఐదుకోట్ల ఆంధ్రులతో ముడిపడిన అంశమని కమిటీ నేతలు తేల్చిచెప్పారు. త్యాగం అంటే అమరావతి రైతులది కాదని.. రాయలసీమ ప్రజలదేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. శాంతికి నిలయమైన తిరుపతి నగరంలో వివాదాలు ఉండరాదనే మౌనం పాటించాల్సి వచ్చిందని కమిటీ నేతలు తెలిపారు.
ఆ చానెల్స్‌తో మాట్లాడతాం
ఇక తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఏబీఎన్, టీవీ 5, టీవీ 9 చానల్స్ యాజమాన్యంతోను చర్చిస్తామని.. తాము చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా ఉండాలని కోరుతామని వారు చెప్పారు. అలాగే, కర్నూలులో హైకోర్టు.. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఉండాలా వద్దా అన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టంచేయాలని వారు డిమాండ్ చేశారు. సీమలో పుట్టి సీమకు అన్యాయం చేస్తే సీమ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతివ్వకుండా అమరావతికి జైకొట్టే నేతలను సీమ ప్రజలు ప్రశ్నించాలని కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
తాము అమరావతికి వ్యతిరేకం కాదని.. అయితే అమరావతితోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వికేంద్రీకరణకు మద్దుతుగా నిలుస్తామని వారు స్పష్టంచేశారు. జలయజ్ఞం పేరుతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని నేతలు గుర్తుచేశారు. మీడియా సమావేశంలో రాయలసీమ అభివృద్ధి అధ్యయన కమిటీ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షిక ప్రతినిధుల సంస్థ అధ్యక్షుడు.. సీమ ఉద్యమకారుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ ఉద్యమకారులు బండి నారాయణస్వామి (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత), జర్నలిస్టు వర్మ తదితరులు మాట్లాడారు. అలాగే, కార్యక్రమంలో రచయిత శాంతి నారాయణ, హైకోర్టు సీనియర్ న్యాయవాది సీహెచ్ శివారెడ్డి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ నాయకులు, వేణుగోపాల్‌రెడ్డి (హిందూ పోరాట సమితి నేత), డాక్టర్ మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment