తిరుపతిలోని టికె రోడ్డు వద్ద మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని చించేస్తున్న టీడీపీ వర్గీయులు
సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/తిరుపతి రూరల్ : అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ సాగిన అమరావతి రైతుల పాదయాత్ర చివరి రోజైన మంగళవారం రైతుల ముసుగులో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ‘మీకు స్వాగతం అంటూ’ తిరుపతి ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశాయి. ఆందోళనకారులు పోలీసులపై ఇష్టారాజ్యంగా దూషణలకు దిగారు. స్థానికులను రెచ్చగొట్టారు. దమ్ముంటే రండిరా అంటూ.. టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు సవాళ్లు చేశారు. పాదయాత్ర దారి పొడవునా నానా యాగీ చేశారు. అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది యత్నించారు. కానీ, విషప్రచారం కోసం రైతుల ముసుగులో వీరు చేస్తున్న కవ్వింపు చర్యలపై రాయలసీమ మేధావుల ఫోరం, ఆప్స్, విద్యార్థులు, యువకులు, స్థానికులు సంయమనం పాటించారు.
స్వాగతం పలికినా అలజడే
అంతకుముందు.. ‘మీతో మాకు గొడవలు వద్దు.. మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి’.. అంటూ రాయలసీమ మేధావుల ఫోరం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్), విద్యార్థులు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సున్నితంగా ప్లెక్సీలతో ప్రదర్శించి పాదయాత్రికులకు స్వాగతం పలికారు. కానీ, మద్యం మత్తులో తూలుతున్న కొంతమంది టీడీపీ, జనసేన కార్యకర్తలు అలజడి సృష్టించారు. ప్లెక్సీలను కాళ్లతో తన్నుతూ చించివేయడంతో కలకలం రేగింది. కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు.. మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఫోరం, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నగరంలో ర్యాలీలు నిర్వహించారు. అయితే.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని గుర్తించిన పోలీసులు వాటిని అడ్డుకున్నారు. అలాగే, తమ ప్రాంత ప్రయోజనాలను అడ్డుకోవద్దంటూ అనంతపురం నుంచి వచ్చిన యువకులకు పోలీసులు నచ్చచెప్పారు. దీంతో వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
తిరుపతిలో ముగిసిన పాదయాత్ర
అమరావతి రైతులు తమ పాదయాత్రను తిరుపతి మండలంలోని రామానాయడు కల్యాణమండపం నుంచి మొదలుపెట్టి నగరంలో కొనసాగించారు. అల్లర్లకు పాల్పడాలనే తమ కవ్వింపు చర్యలకు స్థానికుల నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో కుట్రదారులు నిరాశగా వెనుతిరగడం కనిపించింది. 44రోజులపాటు సాగిన వీరి పాదయాత్ర మంగళవారం సాయంత్రం తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద ముగిసింది.
అల్లరి మూకలపై కేసు నమోదు
ఫ్లెక్సీలు చింపినందుకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించటం.. స్థానికులను రెచ్చగొట్టేలా వ్యవహరించటంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేశారు. ప్లెక్సీలు చింపిన వారిలో టీడీపీ నాయకుడు కంకణాల రజనీకాంత్, నాయకులు నరసింహ యాదవ్, బీఎల్ సంజయ్, కార్యకర్త వెంకటేశ్‌తో పాటు జనసేనకు చెందిన బోత్ హరిప్రసాద్, కిరణ్‌రాయల్, రాజారెడ్డి, సుభాషిణి, రాజేష్‌యాదవ్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.
యాత్ర వెనకున్నది చంద్రబాబే
యూనివర్సిటీ క్యాంపస్: అమరావతి రైతుల పాదయాత్ర వెనకున్నది మాజీ సీఎం చంద్రబాబేనని.. ఈ విషయం అందరికీ తెలుసని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి విమర్శించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీ గురించి మాట్లాడటం దండగన్నారు. శాసనసభ ఎస్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment