మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగునీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేలకోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం.
పల్నాడులో కరువు నివారణ కోసం వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి ఎత్తి పోతలను శర వేగంగా పూర్తి చేస్తాం.
ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్లతో ప్రాజెక్టును చేపట్టాం. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.3,500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులతోపాటు మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, వ్యవసాయం విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెన్నా నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పిస్తామన్నారు.
మొత్తంగా మెట్ట ప్రాంతాలైన దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుందని చెప్పారు. ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా కంపసముద్రం, గుండెమడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్ మిషనరీ (సీఎం), క్రాస్ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం, పంపింగ్ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇదే ప్రాజెక్టుకు సంబంధించి రూ.527.53 కోట్లతో ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించామని చెప్పారు. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయిందని, అవినీతికి చెక్ పెట్టామని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు.
సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సోమశిల హై లెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కండలేరు, రాళ్లపాడు జలాశయాలను వేగంగా నింపేలా చర్యలు
► నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. వాటి పనులు నత్తనడకన జరుగుతుంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి.
► పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి, కండలేరు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–కండలేరు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచేలా అభివృద్ధి (డబ్లింగ్ వర్క్స్) పనులను రూ.918 కోట్ల వ్యయంతో చేపడతాం.
► రాళ్లపాడు జలాశయాన్ని వేగంగా నింపడానికి సోమశిల–రాళ్లపాడు కాలువ సామర్థ్యాన్ని 720 క్యూసెక్కుల నుంచి 1,440 క్యూసెక్కులకు పెంచుతూ అభివృద్ధి చేసే పనులను రూ.632 కోట్ల వ్యయంతో చేపట్టనున్నాం.
► కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆ శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. పైలాన్ వద్ద మంత్రులు అనిల్, మేకపాటి గౌతమ్‌రెడ్ది తదితరులు హాజరయ్యారు.
ఈ ఏడాదే ఆరు ప్రాజెక్టులు పూర్తి
► జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.
► వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ తొలి దశ, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ఈ ఏడాదే పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment