హైకోర్టును, దాని అధికారాలను అగౌరవ పరచడానికి ఈ సభ నిర్వహించడం లేదు. మాకు హైకోర్టు మీద గొప్ప గౌరవం ఉంది. అదే సమయంలో అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యతా మాపై ఉంది. ఎవరో ఫేవర్ చేస్తే ఇక్కడకు రాలేదు. ప్రజలందరూ ఓటు ద్వారా ఎన్నుకుంటే ఇక్కడికి వచ్చాము. ఈ గౌరవాన్ని, ఈ అధికారాన్ని మనం కాపాడుకోలేకపోతే శాసన వ్యవస్థ అన్నదానికి అర్థమే లేకుండా పోతుంది. ఈ రోజు చర్చించకపోతే ఆ తర్వాత చట్టాలు ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్నగా చరిత్రలో మిగిలిపోతుంది. అందుకే ఏ వ్యవస్థ అయినా తన పరిధి దాటకుండా ఇతర వ్యవస్థలను గౌరవిస్తూ పని చేయాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని గుర్తు చేస్తున్నాను.
– శాసనసభలో సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘వికేంద్రీకరణే మా విధానం. రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థదే. ఈ విషయంలో సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ చట్టసభకు ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. ‘న్యాయ వ్యవస్థ పట్ల తిరుగులేని విశ్వాసం ఉంది. అయితే వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గం లేద’ని సవినయంగా తెలిపారు. వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళ్లడం ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆత్మగౌరవం ఉందని చెప్పారు. వికేంద్రీకరణ, రాజధాని అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, ఎవరెవరి పరిధి ఏమిటనే విషయాన్ని అందులో చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని.. అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని పేర్కొన్నారు. శాసనసభ ఫలానా విధానాన్ని, ఫలానా చట్టాన్ని చేస్తుందని ముందస్తుగానే ఊహించుకుని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవన్నారు. రాబోయే రోజుల్లో ఒక చట్టం రాబోతుందని, దానివల్ల ఫలానా రాజధాని ఫలానా చోట పెడతారు.. అని వాళ్లంతట వాళ్లే ఊహించుకుంటే ఎలా? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజు అలాంటి చట్టం ఏదీ లేదని, దాన్ని మనం వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ‘ఈ పరిస్థితిలో ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చినట్టు? మూడు రాజధానులను చేస్తూ ఒక చట్టమే లేనప్పుడు ఈ తీర్పు ఎందుకు వచ్చినట్టు? భవిష్యత్తులో మళ్లీ మెరుగైన చట్టం తీసుకువస్తాం. మూడు రాజధానులకు సంబంధించి ఆలోచన ఇంకా మెరుగ్గా ముందుకు వస్తుంది. అలా రాకూడదని చెప్పి ముందుగానే దాన్ని ప్రివెంట్ చేస్తూ కోర్టులు నిర్దేశించలేవు. శాసన వ్యవస్థ నిర్ధిష్టమైన విధానం, చట్టం చేయకూడదని కోర్టులు ఆదేశించ లేవు’ అని వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
శాసన వ్యవస్థ పరిధిలోనే ఆ అధికారం
► చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుంది. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండదు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఐదేళ్లకోసారి ప్రతి ఒక్కరి పనితీరును మధిస్తారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రభుత్వ పాలన, చట్టాలు నచ్చకపోతే ఇంటికి పంపించేస్తారు.
► ఇంతకు ముందు ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు.. ప్రజలకు గత ప్రభుత్వ విధానాలు, చట్టాలు నచ్చలేదు కాబట్టే ఈ రోజు 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు అంటే 86 శాతం అసెంబ్లీ సీట్లు మనకిచ్చారు. గత ప్రభుత్వ చట్టాలు, విధానాలను వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం.
► ప్రతి ఐదేళ్లకు పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు పరీక్షకు నిలబడతారు. ప్రజల వద్దకు వెళ్లాల్సిందే. ప్రజలు మళ్లీ వాళ్లను తూచి, వాళ్లు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అని మార్కులు వేస్తారు. కోర్టులు ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని చెప్పడానికి ఇదే నిదర్శనం.
► కోర్టులు అసాధ్యమైన కాల పరిమితిలు విధించకూడదు. నెల రోజుల్లోపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, నగరాలను నిర్మించాలి. ఆరు నెలల్లో ఇంకో ఐదారు లక్షల కోట్లతో రాజధాని నిర్మించాలి. ఇలా అసాధ్యమైన పనులు చేయమని శాసన వ్యవస్థను కోర్టులు శాసించ లేవు. దీనిపై చాలా మంది వక్తలు చాలా బాగా మాట్లాడారు. వాళ్లందరినీ అభినందిస్తున్నా.
నాడు అభివృద్ధి కేంద్రీకరణతోనే రాష్ట్ర విభజన
► మొదట్లో అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. రెండోసారి తెలంగాణా ఉద్యమం రాష్ట్ర విభజనకు దారితీసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే రెండోసారి తెలంగాణ ఉద్యమం వచ్చిందని 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది.
► రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు గతంలో ఇదే సభలో అన్ని విషయాలు చెప్పి ప్రస్తావించిన మాటలకు మన ప్రభుత్వం నేటికీ కట్టుబడి ఉంది.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కూడా..
► రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయంతో పాటు పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం లేదని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆ నిర్ణయాధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి తప్ప.. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభకు ఏ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది.
► రాష్ట్ర రాజధానితో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని కూడా చెప్పింది. (‘వుయ్ ఆల్సో హోల్డ్ దట్ ద లెజిస్లేచర్ హేజ్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు పాస్ ఎనీ రిజల్యూషన్/లా ఫర్ చేంజ్ ఆఫ్ కేపిటల్ ఆర్ బైఫర్కేటింగ్ ఆర్ ట్రైఫర్కేటింగ్ ద కేపిటల్ సిటీ’ అని హైకోర్టు పేర్కొన్న వాక్యాలను సీఎం చదివి వినిపించారు.) హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర శాసనసభ అధికారాలను పూర్తిగా హరించేలా ఉంది.
పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది
► రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్ర రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదు. తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనంటూ.. ఆర్టికల్ 3ని కూడా కోట్ చేస్తూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. అఫిడవిట్ కూడా ఇచ్చింది. (అఫిడవిట్‌ను సీఎం చూపించారు)
► ఒక రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేందుకు నిర్ధిష్టమైన విధానం ఏమైనా ఉందా.. అని టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో అడిగితే.. కేంద్రం సమాధానమిస్తూ ‘ఒక రాష్ట్రం రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు’ అని స్పష్టతనిచ్చింది.
► కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ను కూడా దాఖలు చేసింది. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, మిగిలిన అంశాలకు సంబంధించి మాత్రమే నిర్దేశించింది. రాష్ట్రాల రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ఏ నిబంధన కూడా ఇందులో లేదు’ అని స్పష్టంగా పేర్కొంది.
► హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉంటుందన్న వాదనను కూడా కొట్టి పారేసింది.
► ఒకవైపు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని చెబుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారమే అని పార్లమెంట్‌లో చెప్పడంతో పాటు కోర్టులో అఫిడవిట్ వేసింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం?
న్యాయస్థానం పరిధి దాటడం అవాంఛనీయ సంఘర్షణే
► రాజధాని వికేంద్రీకరణ విషయంలో చట్ట సభకు తీర్మానం చేసే అధికారం కూడా లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి శాసన వ్యవస్థ వ్యవహారాల్లోకి ప్రవేశించటం అవాంఛనీయమైన సంఘర్షణే.
► రాజధానితో పాటు నిర్మాణాలు అన్నింటినీ అంటే రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు కనెక్షన్లు మొదలైనవి నెలలోనే పూర్తి చేయాలి.. ఆరు నెలల్లో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. ఇది సాధ్యమౌతుందా అన్నది గమనించాలి.
► ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు తీర్పు పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి తీర్పులు ఉండకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినా ఇలా జరిగింది.
హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని అందరికీ అనిపించింది
► రాష్ట్ర రాజధాని, సీఆర్డీయే చట్టానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు గమనించినట్‌లైతే.. అటు రాజ్యాంగ పరంగానే కాకుండా, ఇటు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా.
► ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలనే మూల స్తంభాలు తమ పరిధిలోనే అధికారాలకు లోబడే పని చేయాలి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని, మరో వ్యవస్థ మీద పెత్తనం చేయకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారు. కానీ ఇటీవల రాష్ట్ర హైకోర్టు తమ పరిధిని దాటినట్టుగా మనందరికీ అనిపించింది. అందుకే ఇవాళ ఈ చట్టసభల్లో చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది.
29 గ్రామాలే కాదు.. మిగిలిన రాష్ట్రం బాధ్యతా మాదే
► రాజధాని నగరంతో పాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపై గ్రాఫిక్స్ రూపంలో ఉంది. మాస్టర్ ప్లాన్‌ను అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. సీఆర్‌డీయే చట్టం ప్రకారం ఆ మాస్టర్ ప్లాన్ కాల పరిమితి 40 ఏళ్లు. ప్రతి ఐదేళ్లకోసారి దాన్ని సమీక్షించాలని కూడా పేర్కొన్నారు. అంటే 40 ఏళ్లకు కూడా సాధ్యం కాదన్నది అందరికీ తెల్సిన విషయం.
► ఇప్పటికి ఆరేళ్లయింది. గ్రాఫిక్స్‌కే పరిమితమైన ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా పేపర్ పైన మాత్రమే ఉంది. ఏ 29 గ్రామాల గురించైతే మాట్లాడుతున్నారో.. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో వాటిని కల్పించడం కోసమే ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు చొప్పన 54 వేల ఎకరాలకు దాదాపు రూ.1.09 లక్షల కోట్లు అవుతుంది.
► అంటే రాబోయే 40 ఏళ్లలో కనీసం 15 లక్షల కోట్లో 20 లక్షల కోట్ల రూపాయలకో వ్యయం పెరుగుతుంది. 54 వేల ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం మీద 0.0001 శాతం ఉంటుంది. మిగిలిన రాష్ట్రం 99.9999 శాతం ఉంది. ఆ ప్రాంతమంతా కూడా అభివృద్ధి, సంక్షేమం కోసం ఎదురు చూస్తోంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది మరచిపోకూడదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా.
► అలా కాకుండా రాజధాని అని నామకరణం చేసి, ఇక్కడ మాత్రమే డబ్బులు పెట్టడం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చాలనే విషయాన్ని మరచిపోకూడదు. సాధ్యం కానివి సాధ్యం చేయాలని ఏ వ్యవస్థలు గానీ, న్యాయస్థానాలుగానీ నిర్దేశించలేవు. అందుకే వీటన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటున్నాం.
► రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకు రావడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడతాం. వారికి కూడా అండగా నిలుస్తాం.
Comments
Please login to add a commentAdd a comment