దీక్షల్లో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు
తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు.. కొంతమంది దళిత దళారులతో రౌండ్ టేబుల్ సమావేశం పేరిట బేరసారాలు కుదుర్చుకుంటున్నాడని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 74వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు ప్రసంగించారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ఓటు హక్కుతో తరిమేసినా..బుద్ధి రాకుండాపోయిందని ఎద్దేవా చేశారు.
దళిత దళారులతో బేరసారాలు ఆడుతూ ప్యాకేజీ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. ప్యాకేజీ పార్టీలను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను మసకబార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని, దళిత దళారులకు, చంద్రబాబు తోక పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగబద్ధంగా తమకు అందించిన హక్కులను పొందే అవకాశం లేకుండా కుయుక్తులు పన్నుతున్న వారిపై త్వరలో కోర్టును ఆశ్రయించి తగిన శిక్ష పడేలా ముందుకు నడుస్తామన్నారు. పలు దళిత సంఘాల నాయకులు మాదిగాని గురునాధం, పెరికే వరప్రసాద్, బేతపూడి సాంబయ్య, నూతక్కి జోషి, ఈపూరి ఆదాం, మల్లవరపు సుధారాణి, ఇందుపల్లి సుభాషిణి, జుజ్జూరపు జస్వంత రాణి, బైదాల సలోమీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment