విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న పవన్. పక్కన సోము వీర్రాజు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అమరావతి మద్దతుదారుల పాదయాత్రను అడ్డుకోవడానికి మంత్రులు, అధికార వైసీపీ నేతలు ఎవరంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదని.. మూడు రాజధానుల గురించి ఎవరూ నోరెత్తకూడదన్నది వైసీపీ ఆలోచన అని.. తమది పొలిటికల్ పార్టీ అని.. తమకూ ఓ వైఖరి ఉంటుందని చెప్పారు. ప్రత్యేక విమానంలో సోమవారం విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి, అక్కడ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.
‘ఏపీ మళ్లీ మూడు ముక్కలుగా విడిపోవాలా. అదా వైసీపీ కోరిక? తిప్పికొడితే 13 జిల్లాలు, వాటిని 26 ముక్కలు చేశారు. దానికి పాలనా సౌలభ్యం అన్నారు. దీనికీ అంతు ఉండాలిగా. ఎక్కడో ఒకచోట ఆగాలి. దీనిని ప్రజలు కూడా గ్రహించాలి. ఉత్తరాంధ్ర, కులం, మతం అంటూ కొట్టుకుంటూ ఉంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. విశాఖ ఘటనలకు సంబంధించి మా పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు. వాళ్ల కాన్వాయి మీద దాడి జరగాలని వాళ్లే ప్లాన్ చేసుకుని మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. మా కేడర్‌కు మనోధైర్యం ఇచ్చా. విశాఖ ఘటనలపై హైకోర్టులో పిటిషన్ వేశాం.
తెలంగాణ రాష్ట్ర సాధన నిర్వీర్యం అవుతుంది
న్యాయ వ్యవస్థకు కూడా అప్పీల్ చేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజున జరుగుతున్న దానిని సునిశితంగా గమనించండి. రాష్ట్ర న్యాయ శాఖను కూడా అభ్యర్థిస్తున్నా. అలాగే, రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. అలా చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఇందుకు పత్రికాధిపతులు, చానల్స్ యజమానుల సహకారం కోరుతున్నా.
ఇక రాష్ట్రంలో జరిగే విషయాలను బీజేపీకి చెప్పవచ్చుగా అని విశాఖలోని కొందరు జర్నలిస్టులు నన్ను ప్రశ్నించారు. కానీ, ఇక్కడ యుద్ధం మీరే చేయండి అని బీజేపీ అగ్రనాయకులు అంటారు. నేను ఢిల్లీకి వెళ్లను. ఇక్కడే తేల్చుకుంటా.. వైసీపీ అధికారంలోకి రాకుండా పోరాడుతా. కోర్టు అంశాలతో పాటు గవర్నర్‌ను కలిసే అంశాలపై చర్చిస్తా.’ అని చెప్పారు.
బెజవాడకు పవన్ పయనం
అంతకుముందు.. మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేసి హంగామా చేసిన పవన్ తాను ఆశించిన ఫలితం దక్కకపోవడంతో విజయవాడకు తిరిగొచ్చారు. ఈనెల 16న జనవాణి కోసం 15వ తేదీ సాయంత్రం ఆయన విశాఖ వెళ్లారు. అదే రోజు మంత్రుల కార్లపై విశాఖ విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత పవన్ హోటల్‌కు వెళ్లిపోవడం.. ఆ మర్నాడు జనవాణి జరిగే పోర్టు స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో జనవాణిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత అరెస్టయిన జనసేన రౌడీమూకలను విడిచిపెట్టే వరకు విశాఖలోనే ఉంటానని పవన్ బీరాలు పలికారు. కానీ, సోమవారం మధ్యాహ్నం విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
పవన్ సోము వీర్రాజు భేటీ
విజయవాడ నోవాటెల్ హోటల్‌లో బసచేసిన పవన్‌కల్యాణ్‌తో సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న సంఘటనలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. తమకు లభిస్తున్న ఆదరణను చూడలేక అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
విశాఖలో జరిగిన దాడి పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించగా.. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని వారు చెప్పారు. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రాంగా అభివర్ణించారు. జన స్పందన లేకపోవడంతో కుట్రకు తెరలేపారని, ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతామని వారిద్దరూ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment