సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న ఆ వ్యాజ్యాలను సైతం తామే విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.ఆ వ్యాజ్యాలను తమ ముందుంచాలని సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలావుంటే రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు, మరికొందరు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలపై విచారణను కూడా ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది.
రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తాము ఇప్పుడు విచారణ జరపడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది
రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజధాని అభివృద్ధి విషయంలో హైకోర్టు నిర్ధేశించిన కాల పరిమితులపై స్టే విధించిందన్నారు. ఈ నెల 31న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపనున్న దృష్ట్యా విచారణను ఫిబ్రవరికి వాయిదా వేయడం మేలన్నారు.
అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో ఇతరులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, ఆ మేరకు మెమో కూడా దాఖలు చేశామన్నారు. ఈ మెమోకు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించిందని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు.
కౌంటర్ దాఖలు చేయకపోవడమే కాక, ప్రధాన అభ్యర్థనను సవరిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారన్నారు. అంతేకాక చట్ట సవరణను సవాల్ చేస్తూ పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వ్యాజ్యాలను జీవో 107ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలతో జత చేయాలని వారు త్రిసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను తమ ముందుంచాలంటూ త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ విషయం మాకెందుకు చెప్పలేదు
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సాయిసంజయ్ సూరనేని వాదనలు వినిపిస్తూ.. చట్ట సవరణపై తాము దాఖలు చేసిన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందన్నారు. విచారణ ముగిసేంత వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయబోమంటూ ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని గతంలో దాఖలైన వ్యాజ్యాలకు సైతం వర్తింప చేయాలని కోరారు. దీనిపై త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
ఇదే అంశంపై ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉందని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయాన్ని ద్విసభ్య ధర్మాసనానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను కూడా తామే విచారిస్తామని స్పష్టం చేసింది.
ఆ వ్యాజ్యాలనూ మేమే విచారిస్తాం
Published Tue, Jan 3 2023 5:02 AM | Last Updated on Tue, Jan 3 2023 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment