
వారానికి ఐదు రోజులే పనిదినాలు
విజయవాడ: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి తరలిపోయే సచివాలయ ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పనిచేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ తాత్కాలిక సచివాలయ ఉద్యోగులకు, అధికారులకు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి వెలగపూడికి వచ్చే ఉద్యోగులకు వర్తిస్తుంది.
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులందరినీ దశలవారీగా కాకుండా జూన్ 27వ తేదీ కల్లా నూతన రాజధానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో అనుకున్నట్లు మూడు దశల్లో కాకుండా మొదటి దశలోనే అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి సిద్ధమైంది. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో కేవలం కార్యదర్శులు, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయాలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ శాఖల విభాగాధిపతుల కార్యాలయాలను వెలగపూడిలో కాకుండా విజయవాడ, గుంటూరు నగరాల్లో జూన్ 27కల్లా ఏర్పాటు చేయనుంది.