నవరసాలను నిరంతరం పండించగలిగే సత్తా ఈ మధ్యకాలంలో ఒక్క బిగ్ బాస్ కార్యక్రమానికి మాత్రం వుందంటే అతిశయోక్తి కాదేమో. బిగ్ బాస్ మిగతా భాషలలో ఏమో కాని తెలుగు లో మాత్రం తమ ప్రేక్షకులు జారిపోకుండా షోని రసవత్తరమైన ఘట్టాలతో ఎప్పటికప్పుడు రక్తి కట్టిస్తూ ఆడియన్స్ ని కట్టిపడేందుకు ప్రయత్నిస్తున్నాడు సదరు బిగ్ బాస్. దీనికి ప్రత్యేక నిదర్శనం ఈ వారం బిగ్ బాస్ కార్యక్రమం. ముఖ్యంగా చఫ్ కంటెండర్ పోటీ కోసం కంటెస్టెంట్లను నాలుగు రంగులతో విభజించి నాలుగాటలు ఆడించి వాళ్ళలో నాలుగు ఎమోషన్స్ తెప్పించి నలుగురు పార్టిసిపెంట్స్ కొట్టుకునేలా చేసి ప్రేక్షకులకు నిత్యం వివాదం తో వినోదాన్ని పంచాలని ప్రయత్నించడం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కంటెస్టంట్ల ఎమోషన్లతో రెచ్చగొట్టడమొకటే కాదు వాళ్ళ ఆరోగ్యాలపై కూడా హైప్ క్రియేట్ చేసి క్యాష్ చేసుకోవడం. పోయిన వారం అవినాష్ కు ఆరోగ్యం బాలేదని, హౌస్ నుండి వెళ్ళిపోతున్నాడని ప్రోగ్రాం చివరలో చూపించి మరుసటిరోజు నామినేషన్స్ నాడు తన ఆరోగ్యం బాగుందని బిగ్ బాస్ డాక్టర్లు ప్రోగ్రాం లో కంటిన్యూ చేయమన్నారని చూపించడం విడ్డూరం. రేపెవ్వరైనా కంటెసెస్టంట్ కు మళ్ళీ హెల్త్ బాగోలేదని చెబితే ప్రేక్షకులు నమ్మాలా లేదా. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నయని పావని. ఈ అమ్మాయిని కదిపినా కదపకపోయినా కన్నీళ్ళు వచ్చేస్తూనే వుంటాయి. అందుకే కాబోలు బిగ్ బాస్ ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేశాడు. బిగ్ బాస్ కార్యక్రమం అనేది ఒక్క హౌస్ లో వున్న కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తోనే కాదు బయట చూసే ప్రేక్షకుల ఎమోషన్స్ తో కూడా ఆడుకుంటున్నాడనేది అక్షర సత్యం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మామూలు డ్రామా కాదు రా రామా!!!
--ఇంటూరి హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment