ఈ రోజుల్లో చాలా మంది తమ సమస్యల గురించి ఆలోచించడం మానేసి పక్క నున్న వ్యక్తి సమస్యల పై దృష్టి సారించడం ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియా కాలంలో ఇలా జరగడం బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదో వ్యసనంలా మారుతోంది. ఈ మధ్య కాలంలో దారి వెంట ఎవరైనా తగాదా పడుతుంటే వారిని వారించడం పోయి వారి దగ్గరకు వెళ్ళి ఆనందంగా వాళ్ళ కొట్లాట చూడటం వాలైతే ఆ కొట్లాటలో తానున్నట్టు సెల్ఫీలు తీసుకోవడం చాలా మందికి అలవాటైంది. ఇటువంటి పద్ధతినే ప్రాతిపదికను చేసుకుని 2017 సంవత్సరంలోనే నెదర్ ల్యాండ్ దేశంలోని జాన్ డి మోల్ అనే వ్యక్తి బిగ్ బ్రదర్ అనే టీవి కార్యక్రమాన్ని రూపొందించాడు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ పొందింటే ఈ రోజుకి దాదాపు 70 కి పైగా దేశాల్లో ప్రైమ్ టైమ్ హిట్‌గా ఈ కార్యక్రమం నిలబడిందన్నదే తార్కాణం.
దానినే ఇప్పుడు భారతదేశంలో బిగ్ బాస్ పేరిట దాదాపు అన్ని భాషలలో రూపొందించారు. కార్యక్రమ అంశమంటూ ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోనక్కరలేదు. సంబంధంలేని దాదాపు ఓ డజను మంది వ్యక్తులను ఓ ప్రాంతంలో కొన్ని రోజులపాటు వుంచితే వారి మధ్య వచ్చే మనస్పర్ధలు, ప్రేమానురాగాలను అందమైన కార్యక్రమంగా రూపొందించడమే ఈ బిగ్ బాస్. మనిషి ప్రతికూలత అంశాన్ని ఎక్కువగా ఆదరిస్తాడన్నదానికి నిదర్శనమే ఈ కార్యక్రమం. అలా అని దీనికి వ్యతిరేకత లేదు అని చెప్పడానికి కాదు, ఎందుకంటే దీనికి ఎంత ఆదరణ వుందో అంతకంటే ఎక్కువే వివాదాలు వున్నాయి. బిగ్ బాస్ తెలుగు లో 8వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ ప్రత్యేకతలు ఏమిటో ప్రతి వారం ఓ చిన్నపాటి విశ్లేషణతో అందించడానికి ప్రయత్నిస్తాం.
'హౌస్ మేట్స్‌కు రుచించని బెజవాడ బేబక్క'
ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రారంభమైన ఈ బిగ్ బాస్ 8 వ సీజన్ కి మునుపటిలాగే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్‌కు టాగ్ లైన్‌గా 'ఎంటర్టైన్ మెంట్‌కు లిమిటే లేదు'గా నిర్ణయించారు. మొత్తంగా 14 కంటెస్టెంట్లో చెప్పుకోదగ్గ వారెవరూ లేకపోయినా కంటెస్టెంట్లందరూ దాదాపుగా తయారై వచ్చినట్టుగా తెలుస్తోంది. మొదటి వారం నామినేషన్ల కన్నా ముందే కంటెస్టంట్ల మధ్య వాడి వేడి వాదనలు జరగడం ప్రేక్షకులకు కనువిందు చేసినట్టైంది. బిగ్ బాస్ అనేది భావోద్వేగభరితమైన షో అని మరోసారి మొదటి రెండురోజుల్లోనే నిరూపించింది ఈ సీజన్.
బిగ్ బాస్‌లో ఏడుపులు పెడబొబ్బలు అన్నవి కామన్ అయినా ఏ సీజన్ లోనూ జరగని ఓ వింత ఈ సీజన్ మొదటివారంలోనే జరిగింది. కంటెస్టంట్ అయిన మణికంఠ నామినేషన్స్‌పై వాడివేడి వాదనలు జరుగుతున్న సమయంలో తన విగ్గును పూర్తిగా తీసేసి విలపించడం హైలెట్. ఈ చర్యపై చూసే ప్రేక్షకులే కాదు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా అవాక్కయ్యారు. మిగతా కంటెస్టెంట్లలో నిఖిల్, శేఖర్ భాషా, సోనియా, విష్ణుప్రియ, యశ్మి తదితరులు ఈ వారం తమ అరుపులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు.
ప్రధానంగా ఓ మెరుపు మెరిసినట్టు హౌస్ లోకి అడుగుపెట్టి తన నలభీమ పాక చేతి వంటతో అందరి మన్ననలు పొందాలనుకున్న బెజడవాడ బేబక్క అలియాస్ మధు ఆశలు మొదటివారం లో నే ఆడియాసలై హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. తన మూర్ఖత్వపు రూల్స్ తో బేబక్క తమ కడుపును మాడుస్తుందని హౌస్ లోని దాదాపు ప్రతి కంటెస్టెంట్ పేర్కొనడం గమనార్హం. అలా బెజవాడ బేబక్క బిగ్ బాస్ ప్రస్థానం ముగిసి బెజవాడ బాట పట్టింది. మరి రానున్న వారాల్లో అంచనాలకు మించి ముందుకు వచ్చిన ఈ బిగ్ బాస్ లో ఇంకెన్ని సంచనలనాలు జరుగుతాయో చూద్దాం.
- ఇంటూరి హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment