భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. సరైన పోషకాహారం, ఆరోగ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఆటగాళ్లకు ఆరోగ్యంతో కూడిన ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌లకు అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
క్రీడా మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ఏ క్రీడా జట్టుకైనా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంతో అవసరం. అథ్లెట్లు, వారి కోచ్‌లకు అనుసంధానంగా క్రీడా పోషకాహార నిపుణులు పని చేస్తుంటారు. అథ్లెట్ లేదా ఆటగాడి పనితీరు వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సూచనలు, సలహాలు అందించే ఆరోగ్య నిపుణులు రాష్ట్రానికి లేదా దేశానికి పతకాలు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కావడానికి బీఎస్‌సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సు చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక మెడికల్ స్ట్రీమ్‌లోకి వెళ్లేవారు లేదా న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన ఈ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్ లేదా న్యూట్రిషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేయడం ద్వారా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా ఉపాధి లేదా ఉద్యోగం పొందవచ్చు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్‌సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అందిస్తోంది. డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును అన్నామలై యూనివర్సిటీ అందిస్తోంది. డైటెటిక్స్‌లో ఎంఎస్‌సీని కేరళ విశ్వవిద్యాలయం అందిస్తోంది.
స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం. క్రీడా పోషకాహార నిపుణులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి, ఉద్యోగ మార్గాలను అందుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment