సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలను అమలు పరిచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలనే దానిపై చర్చించిన కేబినెట్.. ఈ అంశంపై లోతైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తు నిర్ణయం తీసుకుంది. ఆశావర్కర్ల వేతనాల పెంపుకు కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆశావర్కర్ల జీతాలు 10వేల రూపాయలకు పెరగనున్నాయి. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేయాలని వైఎస్ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లుల ఖాతాల్లోకి రూ.15,000 జమ చేయనున్నారు.
అలాగే, సీపీఎస్ రద్దు చేసిన పక్షంలో ఆ నిధిని వెనక్కు తీసుకోవడంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించడానికి కమిటీ ఏర్పాటుకు వైఎస్ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేబినెట్ తీపి కబురు అందజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ 27 శాతం పెంపునకు ఆమోద ముద్ర వేసింది. సామాజిక పింఛన్లు రూ. 2,250 పెంపునకు కూడా ఆమోదం తెలిపింది. రైతు భరోసాకు ఆమోదం తెలిపిన కేబినెట్.. అక్టోబర్ 15 నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రతి శాఖలోను అవినీతి జరగకుండా మంత్రులు సర్వశక్తులు ఒడ్డాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. నామినేటెడ్ పదవులను రద్దు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. కాగా, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కాసేపట్లో మీడియాకు వివరించనున్నారు.
గతానికి భిన్నంగా సాగిన కేబినెట్ సమావేశం.. రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండగా సాగింది. పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలపై స్పష్టతతో, ఆర్థిక పరిస్థితిపై అవగాహనతోనే తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఇన్ని నిర్ణయాలు తీసుకోగలిగారని చెప్పవచ్చు.
చదవండి : ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
Comments
Please login to add a commentAdd a comment