హైదరాబాద్లో ఉంటే కుదరదు: చంద్రబాబు
గుంటూరు : సౌకర్యాల లేవని ఉద్యోగులు హైదరాబాద్లో ఉంటే కుదరదని, అమరావతికి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణపు పనులను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వీలు అయినంత త్వరలో సచివాలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27కల్లా చాలావరకు నిర్మాణాలు పూర్తవుతాయన్నారు.
ఏ విభాగానికి ఎక్కడ కేటాయిస్తామో ఆయా శాఖలకు సమాచారం ఇస్తామన్నారు. ఉద్యోగులకు అన్ని వసతులు కల్పిస్తామని, ఇంకా ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించారు. ముందుగా కొందరు ఉద్యోగులు వస్తారని, ఆ తర్వాత మరికొందరు వస్తారని ఆయన అన్నారు. తాను బస్సులో పడుకుని పని చేయడం లేదా అని అన్నారు. ప్రభుత్వంతో పాటు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటేనే పరిపాలన సజావుగా సాగుతుందన్నారు.
మరోవైపు ఉద్యోగుల తరలింపుపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ స్థానికత, హెచ్ఆర్ఏపై స్పష్టత రాకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రోడ్ మ్యాప్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఉద్యోగాల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరిస్తే తాత్కాలిక రాజధానికి వెళ్లేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని మురళీకృష్ణ తెలిపారు. కొంతమంది ఉద్యోగులు తమ స్వలాభం కోసం ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.