అదంతా మీడియా సృష్టే: నరసింహన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గవర్నర్ నరసింహన్ గురువారం పర్యటించారు. వెలగపూడి వచ్చిన గవర్నర్‌కు సీఎం, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తాత్కాలిక సచివాలయాన్ని చంద్రబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కొన్ని సమస్యలున్నా ఉద్యోగులు రాజధానికి రావడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు పాత్ర అభినందనీయమన్నారు. తాను కేవలం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మాత్రమే అని, చంద్రబాబే కెప్టెన్ అని ఆయన అ న్నారు. తాను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యానన్నది మీడియా సృష్టేనన్నారు.
తాను కూడా ఏపీ సచివాలయానికి వస్తానని, తనకు కార్యాలయం కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. కొత్త రాజధాని కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయని అన్నారు. కాగా నిన్న చంద్రబాబుతో చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు. చాలా అంశాలను చంద్రబాబు తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కూర్చుని సమస్యలు పరిష్కరానికి రావాలని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయంలో బ్లాక్ల నిర్మాణం గురించి గవర్నర్కు వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.