గుంటూరు : వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్, మంత్రి అయ్యన్నపాత్రుడు బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయాన్నిఆరంభించారు. ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఇద్దరు మంత్రుల పేషీలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా రెండు గంటల 59 నిమిషాలకు మంత్రులు కిమిడి మృణాళిని, అయ్యన్నపాత్రుడు.....తమ తమ పేషీల్లోకి ప్రవేశించారు. వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ....రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగు పెట్టారు.
సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రుల కార్యాలయాలను రూపొందించారు. మొత్తం ముగ్గురు మంత్రుల పేషీలు ఇవాళ ప్రారంభమవుతాయని తొలుత ప్రకటించనప్పటికీ మంత్రి కామినేనిశ్రీనివాస్ ఢిల్లీలో ఉన్నందున ఆయన కార్యాలయ ప్రారంభం వాయిదా పడింది. కోలాహలంగా సాగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
మంత్రులతో పాటు ఎస్డీ, హెచ్వోడీ కార్యాలయాలు ఆరంభం అయ్యాయి. ఇక గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన ఉద్యోగులను ఇప్పటికే వెలగపూడికి ఐదు బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. కాగా ఉద్యోగుల తరలింపు కొనసాగుతోందని మరో రెండు నెలల్లో సెక్రటేరియేట్ పనులు పూర్తవుతాయని.. అప్పటకి ఉద్యోగులందరినీ అమరావతికి తరలిస్తామని ఏపీ సీస్ ఠక్కర్ స్పష్టం చేశారు.