మంత్రి అచ్చెన్నాయుడు కొట్టారని..
- సచివాలయం వద్ద ఆర్ అండ్ బీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
- ముఖ్యమంత్రిని కలవనీయలేదని మత్తు బిళ్లలు మింగిన వైనం
- సీఐ, ఎస్‌ఐ లైంగికంగా వేధించారని ఆరోపణ
- బలవంతంగా తరలించిన పోలీసులు?
మంగళగిరి/తుళ్లూరు రూరల్ (తాడికొండ): ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించలేదని ఆర్‌అండ్‌బీ ఉద్యోగిని కూరపాని కల్యాణి సచివాలయం మొదటిగేటు వద్ద బుధవారం మత్తు బిళ్లలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఆమెను మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తరువాత రాత్రి ఏడుగంటల సమయంలో ఆమెను బలవంతంగా రైల్లో సొంత ఊరికి తరలించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో ఆమె తనగోడు విలేకరులకు తెలిపారు.
రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తనను కొట్టారని, టెక్కలి సీఐ, ఎస్‌ఐ లైంగికంగా వేధించారని ఆరోపించారు. తన తండ్రి కూరపాని అప్పారావు ఆర్‌అండ్‌బీ శాఖలో రోడ్‌రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మృతిచెందడం తో తనకు అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చిందని తెలి పారు. పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న తాను సమర్పించిన పదో తరగతి సర్టిఫికెట్ నకిలీదని ఆర్‌అండ్‌బీ అధికారులు తనపై కేసు పెట్టారని చెప్పారు. అధికారులు ఉద్దేశ పూర్వకంగానే వేధిస్తున్నారని తాను తిరిగి వారిపై కేసు పెట్టానని తెలిపారు. టెక్కలి సీఐ, ఎస్‌ఐ తన కేసు గురించి పట్టించుకోకపోగా తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. సమస్యను మంత్రి అచ్చెన్నాయుడుకు తెలిపేందుకు వెళ్లగా.. ఆయన అధికారుల మాటలు విని తనను కొట్టి అవమానించారని చెప్పారు.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి విన్నవించగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు న్యాయం చేయకపోగా తనపై పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదనతో చెప్పారు. తన బాధను ముఖ్యమంత్రికి మరోసారి చెప్పుకోవడానికి వస్తే కలవనీయడం లేదని, ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆమె తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నుంచి పట్టణ ఎస్‌ఐ వినోద్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బలవంతంగా తరలిస్తున్నారు..
‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపిన కల్యాణి
‘సార్ నన్ను పోలీసులు బలవంతంగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. మా ఊరికి పంపుతున్నారు.. నా చుట్టూ పోలీసులున్నారు. మాట్లాడటానికి కూడా వీలులేదు. అందుకే బాత్‌రూంకి వచ్చి మాట్లాడుతున్నాను.. నేను మా ఊరికి వెళితే నాకు అక్కడ న్యాయం జరగదు.. నాకు న్యాయం కావాలి సార్..’ అంటూ కల్యాణి బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేశారు. సాక్షి ప్రతినిధులు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి ఆమె ఫోన్ అందు బాటులో లేదు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు గాలించినా ఆమె జాడ కనిపించలేదు.