R and B employee
-
గెస్ట్‌హౌజ్‌కి వెళ్లి ఉద్యోగం ఎలా చేయాలి?
సాక్షి, కాకినాడ/తూర్పు గోదావరి : ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇలాఖాలో ఆర్ అండ్ బీ ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెద్దాపురం గెస్ట్‌హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ అండ్ బీ డివిజన్ ఉద్యోగులు సరైన సదుపాయాలు లేకపోవడంతో మంచాలు, సోఫాలపై కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మౌలిక సదుపాయాల లేమితో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది సెలవులో వెళ్లిపోగా.. గెస్ట్‌హౌజ్‌లో ఎలా ఉద్యోగం చేయాలంటూ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పెద్దాపురంలో ఆర్ అండ్ బీ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ గతేడాది డిసెంబరు 20న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అక్కడి గెస్ట్‌హౌజ్‌లోనే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ 30 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఈఈ సత్యనారాయణ వల్లే గెస్ట్‌హౌజ్‌లో పనిచేయాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. -
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ఆదోని (కర్నూలు): ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. నడిరోడ్డుపై గుంతలు పడి రెండు నెలలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఓ వ్యక్తి సోమవారం అందులో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మాధవరం రోడ్డులో మడుగును తలపిస్తున్న గుంతలో సోమవారం సాయంత్రం దాదాపు 48ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని ఓ వ్యక్తి పడ్డాడు. స్థానికులు వెంటనే బయటకు తీసి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిర్వహిస్తే మృతికి కారణాలు తెలుస్తాయని డాక్టర్ తెలిపారు. అయితే మూర్చవ్యాధితోనే గుంతలో పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గుర్తు తెలియన మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నట్లు అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ రామక్రిష్ణ తెలిపారు. అధికారులే బాధ్యత వహించాలి రెండు నెలల నుంచి కుంటను తలపించే స్థాయిలో గుంత పడి ట్రాఫిక్ స్తంభించి పోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. బస్సులు, ఆటోలు బురద నీటిలో కూరుకుపోయి నిలిచిపోతున్నాయని, ద్విచక్రవాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను తెలియజేస్తూ సోమవారం ‘సాక్షి’ కూడా ‘నీటి కుంట కాదు రోడ్డే’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అయినా అధికారులు అటువైపు తొంగి చూడలేదు. ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ వ్యక్తి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, అందుకు వారే బాధ్యత వహించాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్అండ్బీ ఏఈ
వరంగల్ క్రైం: రోడ్డు పని చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్అండ్బీ అసిస్టెంట్ ఇంజనీర్ గురువారం ఉదయం ఏసీబీ అధికారులకు చిక్కాడు. హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని ఆర్అండ్బీ అర్బన్ కార్యాలయంలో బాధిత కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి నుంచి ఏఈ కోటేశ్వర్ రూ.60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్షణాల్లో జరిగిపోయిన ఏసీబీ దాడులతో కార్యాలయంలోని మిగతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ ముద్దసాని కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. హన్మకొండ పెద్దమ్మగడ్డ రోడ్డులో ఆర్ఆర్ గార్డెన్ దగ్గర రోడ్డు విస్తరణ, కల్వర్ట్ నిర్మాణంలో భాగంగా రూ.45 లక్షల పని జరిగింది. రెండు విడతల్లో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డికి రూ.30 లక్షల బిల్లులు వచ్చాయి. మిగతా రూ.15 లక్షల బిల్లుల కోసం ఏఈ కోటేశ్వర్రావు రూ.60 వేలు డిమాండ్ చేశాడు. సంవత్సరం క్రితమే పని పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని, తనను ఏఈ లంచం డిమాండ్ చేస్తున్నాడని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల సూచన మేరకు తిరుపతిరెడ్డి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని ఆర్అండ్బీ కార్యాలయానికి వెళ్లి కోటేశ్వర్రావుకు రూ.60 వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు వెళ్లి ఏఈని పట్టుకున్నారు. కార్యాలయంతోపాటు ఏకకాలంలో కోటేశ్వర్రావు ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అనంతరం కోటేశ్వర్‌రావును విచారించగా డబ్బులు ఈఈ లక్ష్మన్‌నాయక్, డీఈ అడగమంటేనే తాను అడిగినట్లు ఏసీబీ అధికారులకు తెలిపాడు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వాసాల సతీష్, క్రాంతికుమార్, పులి వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. నెల రోజుల్లో ఉద్యోగ విరమణ వచ్చే నెలలో తనకు ఉద్యోగ విరమణ ఉందని, తనను అరెస్ట్ చేయొద్దని ఏసీబీ అధికారులను ఏఈ కోటేశ్వర్రావు బతిమిలాడినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణకు ముందు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు కోటేశ్వర్రావు పట్టుబడినట్లు కార్యాలయం సిబ్బంది మాట్లాడుకోవడం కనిపించింది. -
మంత్రి అచ్చెన్నాయుడు కొట్టారని..
సచివాలయం వద్ద ఆర్ అండ్ బీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం ముఖ్యమంత్రిని కలవనీయలేదని మత్తు బిళ్లలు మింగిన వైనం సీఐ, ఎస్ఐ లైంగికంగా వేధించారని ఆరోపణ బలవంతంగా తరలించిన పోలీసులు? మంగళగిరి/తుళ్లూరు రూరల్ (తాడికొండ): ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించలేదని ఆర్అండ్బీ ఉద్యోగిని కూరపాని కల్యాణి సచివాలయం మొదటిగేటు వద్ద బుధవారం మత్తు బిళ్లలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఆమెను మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తరువాత రాత్రి ఏడుగంటల సమయంలో ఆమెను బలవంతంగా రైల్లో సొంత ఊరికి తరలించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో ఆమె తనగోడు విలేకరులకు తెలిపారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తనను కొట్టారని, టెక్కలి సీఐ, ఎస్ఐ లైంగికంగా వేధించారని ఆరోపించారు. తన తండ్రి కూరపాని అప్పారావు ఆర్అండ్బీ శాఖలో రోడ్‌రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మృతిచెందడం తో తనకు అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చిందని తెలి పారు. పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న తాను సమర్పించిన పదో తరగతి సర్టిఫికెట్ నకిలీదని ఆర్అండ్బీ అధికారులు తనపై కేసు పెట్టారని చెప్పారు. అధికారులు ఉద్దేశ పూర్వకంగానే వేధిస్తున్నారని తాను తిరిగి వారిపై కేసు పెట్టానని తెలిపారు. టెక్కలి సీఐ, ఎస్ఐ తన కేసు గురించి పట్టించుకోకపోగా తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. సమస్యను మంత్రి అచ్చెన్నాయుడుకు తెలిపేందుకు వెళ్లగా.. ఆయన అధికారుల మాటలు విని తనను కొట్టి అవమానించారని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి విన్నవించగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు న్యాయం చేయకపోగా తనపై పోలీసులు, ఆర్అండ్బీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదనతో చెప్పారు. తన బాధను ముఖ్యమంత్రికి మరోసారి చెప్పుకోవడానికి వస్తే కలవనీయడం లేదని, ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆమె తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నుంచి పట్టణ ఎస్ఐ వినోద్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బలవంతంగా తరలిస్తున్నారు.. ‘సాక్షి’కి ఫోన్లో తెలిపిన కల్యాణి ‘సార్ నన్ను పోలీసులు బలవంతంగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. మా ఊరికి పంపుతున్నారు.. నా చుట్టూ పోలీసులున్నారు. మాట్లాడటానికి కూడా వీలులేదు. అందుకే బాత్రూంకి వచ్చి మాట్లాడుతున్నాను.. నేను మా ఊరికి వెళితే నాకు అక్కడ న్యాయం జరగదు.. నాకు న్యాయం కావాలి సార్..’ అంటూ కల్యాణి బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేశారు. సాక్షి ప్రతినిధులు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి ఆమె ఫోన్ అందు బాటులో లేదు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు గాలించినా ఆమె జాడ కనిపించలేదు.