ప్రమాదానికి కారణమైన గుంత, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ఆదోని (కర్నూలు): ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. నడిరోడ్డుపై గుంతలు పడి రెండు నెలలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఓ వ్యక్తి సోమవారం అందులో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మాధవరం రోడ్డులో మడుగును తలపిస్తున్న గుంతలో సోమవారం సాయంత్రం దాదాపు 48ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని ఓ వ్యక్తి పడ్డాడు. స్థానికులు వెంటనే బయటకు తీసి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిర్వహిస్తే మృతికి కారణాలు తెలుస్తాయని డాక్టర్ తెలిపారు. అయితే మూర్చవ్యాధితోనే గుంతలో పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గుర్తు తెలియన మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నట్లు అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ రామక్రిష్ణ తెలిపారు.
అధికారులే బాధ్యత వహించాలి
రెండు నెలల నుంచి కుంటను తలపించే స్థాయిలో గుంత పడి ట్రాఫిక్ స్తంభించి పోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. బస్సులు, ఆటోలు బురద నీటిలో కూరుకుపోయి నిలిచిపోతున్నాయని, ద్విచక్రవాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను తెలియజేస్తూ సోమవారం ‘సాక్షి’ కూడా ‘నీటి కుంట కాదు రోడ్డే’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అయినా అధికారులు అటువైపు తొంగి చూడలేదు. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ వ్యక్తి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, అందుకు వారే బాధ్యత వహించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment