ఆర్ అండ్ బీ ఇంజనీర్లను విచారిస్తున్న ఏసీబీ అధికారులు(ఇన్‌సెట్) కోటేశ్వర్‌రావు, ఏఈ
వరంగల్ క్రైం: రోడ్డు పని చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్ ఇంజనీర్ గురువారం ఉదయం ఏసీబీ అధికారులకు చిక్కాడు. హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని ఆర్‌అండ్‌బీ అర్బన్ కార్యాలయంలో బాధిత కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి నుంచి ఏఈ కోటేశ్వర్ రూ.60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
క్షణాల్లో జరిగిపోయిన ఏసీబీ దాడులతో కార్యాలయంలోని మిగతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ ముద్దసాని కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. హన్మకొండ పెద్దమ్మగడ్డ రోడ్డులో ఆర్‌ఆర్ గార్డెన్ దగ్గర రోడ్డు విస్తరణ, కల్వర్ట్ నిర్మాణంలో భాగంగా రూ.45 లక్షల పని జరిగింది. రెండు విడతల్లో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డికి రూ.30 లక్షల బిల్లులు వచ్చాయి. మిగతా రూ.15 లక్షల బిల్లుల కోసం ఏఈ కోటేశ్వర్‌రావు రూ.60 వేలు డిమాండ్ చేశాడు.
సంవత్సరం క్రితమే పని పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని, తనను ఏఈ లంచం డిమాండ్ చేస్తున్నాడని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల సూచన మేరకు తిరుపతిరెడ్డి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి వెళ్లి కోటేశ్వర్‌రావుకు రూ.60 వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు వెళ్లి ఏఈని పట్టుకున్నారు.
కార్యాలయంతోపాటు ఏకకాలంలో కోటేశ్వర్‌రావు ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అనంతరం కోటేశ్వర్‌రావును విచారించగా డబ్బులు ఈఈ లక్ష్మన్‌నాయక్, డీఈ అడగమంటేనే తాను అడిగినట్లు ఏసీబీ అధికారులకు తెలిపాడు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వాసాల సతీష్, క్రాంతికుమార్, పులి వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.
నెల రోజుల్లో ఉద్యోగ విరమణ
వచ్చే నెలలో తనకు ఉద్యోగ విరమణ ఉందని, తనను అరెస్ట్ చేయొద్దని ఏసీబీ అధికారులను ఏఈ కోటేశ్వర్‌రావు బతిమిలాడినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణకు ముందు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు కోటేశ్వర్‌రావు పట్టుబడినట్లు కార్యాలయం సిబ్బంది మాట్లాడుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment