
రెయిన్ ట్రీకి ఐఏఎస్ లు ‘క్యూ’
నూతన రాజధాని ప్రాంతంలోని రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్లలో వసతి కోసం ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు క్యూ కడుతున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన 766 దరఖాస్తుల్లో 316 రెయిన్ ట్రీకే..
విజయవాడ : నూతన రాజధాని ప్రాంతంలోని రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్లలో వసతి కోసం ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు క్యూ కడుతున్నారు. రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్‌లో వసతి కావాల్సిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించింది. ఇప్పటివరకు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రెయిన్ ట్రీలో వసతి కోసం మొత్తం 766 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో రెయిన్ ట్రీకి 316 మంది మొగ్గు చూపారు.
వీరిలో సీనియర్ ఐఏఎస్‌లైన మన్మోహన్ సింగ్, జె.సి.శర్మ, అజేయ కల్లం, పి.వి.రమేశ్, అనిల్ చంద్ర పునేత, దినేశ్‌కుమార్, ఎస్.వి.ప్రసాద్, శ్రీనరేశ్, లవ్ అగర్వాల్, అనంతరాము తదితరులున్నారు. అలాగే ఐఎఫ్‌ఎస్ అధికారులు బిస్వాస్, రిజ్వి, గోపీనాథ్, సుందర పాండే, రమణమూర్తి, రత్నాకర్ జౌహరి, సుధాకర్, కె.ఎస్.రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది.
మరోపక్క వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి మిగతా శాఖల ఉద్యోగుల తరలింపునకు మరో రెండు ముహూర్తాలను సర్కారు ఖరారు చేసింది. ఈ నెల 21 మధ్యాహ్నం 1.35 గంటలకు ఐదో భవనంలోని తొలి అంతస్తులోకి రహదారులు-భవనాల శాఖ, విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలను తరలించనున్నారు. హైదరాబాద్ సచివాలయం నుంచి మిగతా శాఖలన్నీ కూడా ఈ నెల 29 సాయంత్రం 5 గంటలకు తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లాలని నిర్ణయించారు.