తాత్కాలిక సచివాలయానికి రూ.180 కోట్లా ?
విజయవాడ : రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందంటూనే తాత్కాలిక సచివాలయానికి రూ.180 కోట్లు వెచ్చించడం అవసరమా? అని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ వైపు రాజధాని నిర్మాణానికి స్కూల్ పిల్లల నుంచి చందాలు వసూలు చేస్తున్న ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాలకు వేల కోట్లు ఖర్చు చేయడం సరికాదని పేర్కొన్నారు.
ప్రజా రాజధాని నిర్మిస్తామంటే రైతులు 33 వేల ఎకరాల భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. తాత్కాలిక కార్యాలయాల కోసం మంత్రి నారాయణ భవనాలు త్యాగం చేయలేరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆకాశంలో విహరిస్తోందని, నేలమీదకు వచ్చి ప్రజలకు పాలన అందించాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం కోసం ఒత్తిడి చేయాలని కోరారు.
మాస్టర్ ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు తక్షణమే మార్పు చేయాలని కోరారు. వ్యవసాయం, పంటలపై ప్రేమతో అగ్రికల్చర్ జోన్‌లు ఏర్పాటు చేయలేదని, రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెంచుకునేందుకేనని విమర్శించారు. మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు కోరుతూ రైతులకు అర్థం కాకుండా నోటిఫికేషన్ ఇంగ్లిష్‌లో విడుదల చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
తెలుగులో తర్జుమా చేసి ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వందల ఎకరాల భూమి, వేల కోట్లు నిధులు ఖర్చు చేయడం దండగన్నారు. ప్రస్తుత పరిస్థితులు, జనాభా దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పంట భూములను లాగేసుకుని కాంక్రీట్ జంగిల్‌గా మార్చవద్దన్నారు. ప్రభుత్వం పునరాలోచించి గ్రీన్‌బెల్ట్ నిబంధనలు మార్చాలని, ప్రజాధనాన్ని దుబారా చేయవద్దని కోరారు.