అసలు కాదు కదా... వడ్డీ కూడా మాఫీ కాలేదు | The original can not be ... could be waived interest | Sakshi
Sakshi News home page

అసలు కాదు కదా... వడ్డీ కూడా మాఫీ కాలేదు

Published Sun, Apr 12 2015 2:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఆఫీస్ ఎదుట రుణమాఫీ కాని రైతుల క్యూ... - Sakshi

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఆఫీస్ ఎదుట రుణమాఫీ కాని రైతుల క్యూ...

రైతుల తీవ్ర ఆవేదన..  హైదరాబాద్ వచ్చినా ఒరిగింది లేదని నిట్టూర్పు
సాక్షి, హైదరాబాద్: ‘‘బ్యాంకుల్లో అసలూ వడ్డీ కలిపి అప్పు పెరిగిపోయింది. వడ్డీ కట్టి రుణాలు రీషెడ్యూలు చేసుకోవాలంటున్నారు. బంగారం వేలం వేస్తామంటూ నోటీసులిచ్చారు. పంటలు లేవు. దిక్కుతోచడం లేదు. హైదరాబాద్‌కు వెళితే అక్కడ పరిష్కరిస్తారని చెబితే ఈడ్చుకుంటూ ఇంతదూరమొచ్చాం. ఇక్కడికొస్తే మీ పేర్లను బ్యాంకులు తొలగించాయి. మేమేం చేయలేమంటున్నారు.

ఇప్పుడేం చేయాలో అర్థంకావడంలేదు’’.... రాష్ట్ర సచివాలయానికి తండోపతండాలుగా తరలివస్తున్న రైతులు మొర  ఇది. రుణ మాఫీని అమలు చేశామని ప్రభుత్వం గొప్పగా చేస్తున్న ప్రచారం ఉత్త డొల్ల అని సచివాలయానికి తరలివస్తున్న రైతులను బట్టి స్పష్టమవుతోంది. అసలు సంగతి దేవుడెరుగు... కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదంటూ మండిపడుతున్నారు. రెండు విడతలుగా చెల్లించామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఉత్తిదేననడానికి వారే నిదర్శనంగా నిలుస్తున్నారు.
 
సచివాలయానికి తండోపతండాలుగా..
రుణ మాఫీకి సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి నివేదించాలని ప్రభుత్వం పేర్కొంది. దాంతో గత కొద్దిరోజులుగా రుణమాఫీ కాని వేలాదిమంది రైతులు తమ బాధలు నివేదించడానికి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు మాఫీ కాక మరోవైపు వడ్డీ పెరిగిపోతుంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చినందుకు చార్జీలు, భోజనం, బస.. పేరిట అదనంగా చేతి చమురు వదుల్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
 
ఉపయోగం లేదు.. ఉపశమనమూ లేదు...
వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్‌కు వస్తున్న రైతులకు సచివాలయంలో సరైన ఆదరణ కూడా లభించడం లేదు. వారు ఎక్కడ ఎవరిని కలవాలన్న విషయంలోనూ అధికారులు కనికరం చూపించట్లేదు. కొందరు రైతులనుంచి వారిచ్చిన పత్రాలను తీసుకుని నమోదు చేసుకున్నాం.. మీరెళ్లొచ్చంటూ ఛీదరించుకుంటుంటే దిక్కుతెలియని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతూ వెనుదిరుగుతున్నారు.

బంగారు రుణాల వేలం వేస్తామంటూ వచ్చిన నోటీసులను చూపించినా ఎవరూ స్పందించట్లేదని రైతులు బోరుమంటున్నారు. బ్యాంకులకు వెళితే హైదరాబాద్‌లో ఫిర్యాదుల విభాగంలో చెప్పుకోవాలన్న సమాధానం వస్తుంటే, తీరా హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత బ్యాంకులు తప్పుచేశాయని అధికారులు చెప్పిపంపిస్తున్నారు. గత సోమవారం హైదరాబాద్ వచ్చి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలసిన రైతులకు నిరాశే ఎదురైంది. బ్యాంకులు తప్పు చేశాయని, అందువల్ల మాఫీ కాలేదని, ఇప్పుడేమీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు.

ఎంతో వ్యయప్రయాసలకు లోనై హైదరాబాద్ వచ్చిన రైతులు ఈ మాటలు వినేందుకా తాము ఇంతదూరం వచ్చింది అనుకుని నిర్ఘాంతపోయారు. రెండు విడతల్లోనూ సక్రమంగా రుణమాఫీ జరగలేదు. దీంతో రుణమాఫీ కానివారిని హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరడం తెలిసిందే. ఇదిలా ఉండగా మీ ప్రాంతంలో ఎవరికైనా రుణాలు మాఫీ అయ్యాయా? అని ఇక్కడికొస్తున్న రైతులను ఎవర్ని అడిగినా మాఫీ అయిందని చెబుతున్నవారు ఒక్కరూ కనిపించట్లేదు.
 
ఇదేం తీరు...: మాఫీ కానివారి సమస్యలు పరిష్కరించడానికి మండల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయకుండా హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదులు చేయాలని ప్రభుత్వం పేర్కొనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  హైటెక్, ఆన్‌లైన్ యుగం నడుస్తుండగా.. మండల వ్యవసాయ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించలేరా? అని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.
 
ఈ మాటేదో ముందే చెప్పవచ్చు కదా...
బంగారంపై పంట రుణం తీసుకున్నప్పటికీ రుణ మంజూరు పత్రాల్లో ఏ పంటకు రుణం ఇచ్చిందో బ్యాంకులు రాయనందున రుణమాఫీకి అర్హత లేదంటూ ప్రభుత్వం తిరస్కరించింది. అలాంటివారు ఇప్పుడు హైదరాబాద్ బాట పడుతున్నారు. తీరా అష్టకష్టాలు పడి హైదరాబాద్ వచ్చినా వారికి ఉపశమనం కలగకపోగా మరింత వడ్డీ భారం పడుతోంది. బ్యాంకులు సరిగా వివరాలను నింపనందున మీ రుణాలు మాఫీ కావని ఇక్కడ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ఈ మాటేదో హైదరాబాద్ రాక ముందే చెప్పవచ్చు కదా.. అని వారు ప్రశ్నిస్తున్నారు.
 
14వ తేదీ తర్వాతే రండి...

ఇదిలా ఉండగా రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక ప్రకటన జారీ చేసింది. రెండో శనివారం, ఆదివారం సెలవులైనందున, అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతి సెలవు ఉన్నందున... 14వ తేదీ వరకు రైతులెవరూ హైదరాబాద్ రావద్దని, ఆ తరువాతనే రావాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement