
వెలగపూడి వెళ్లాల్సిందే...
27న పయనమవ్వాలని కార్యదర్శులకు ఏపీ సీఎస్ టక్కర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి అయినా, కాకపోయినా ముఖ్యమంత్రి పేర్కొన్న మేరకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ నెల 27న వెలగపూడి వెళ్లాలని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ స్పష్టం చేశారు. అదే తేదీన సీఎస్ కార్యాలయాన్ని సిబ్బంది సహా వెలగపూడికి తరలించాలని సూచించారు. ఆర్థిక శాఖతో పాటు ఆ శాఖకు చెందిన వివిధ విభాగాధిపతుల కార్యాలయాలను నూతన రాజధానికి తరలించే ప్రణాళిక అమలు కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఆఫీస్ ఆర్డర్ జారీ చేశారు. తరలింపు కమిటీకి చైర్మన్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను నియమించారు. రవిచంద్ర మరిన్ని ఉప కమిటీలను ఏర్పాటు చేసి శనివారం సమావేశం నిర్వహించారు. ఐటీ మౌలిక వసతులు, ఫైళ్లు, రికార్డులు, ఫర్నిచర్ తదితర ఉప కమిటీలను ఏర్పాటు చేశారు.
రెండేళ్ల ఫైళ్ల స్కానింగ్‌కు ఏర్పాట్లు: రాష్ట్రం విడిపోవడానికి ముందుగానే ఫైళ్లను స్కానింగ్ చేసి ఇరు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లను విభజించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్తున్న సమయంలో కూడా ముఖ్యమైన ఫైళ్లను స్కానింగ్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రాష్ట్రం విడిపోయిన సమయంలో లక్షల సంఖ్యలో ఉన్న ఫైళ్లకు చెందిన కోట్లాది పేజీలను స్కానింగ్ చేశారు. ఇప్పుడు రెండేళ్లకు చెందిన ఫైళ్లను మాత్రమే స్కానింగ్ చేయనున్నారు.