జూలై 21కి పూర్తిస్థాయిలో సచివాలయం
- వెలగపూడి సచివాలయానికి రేపు మధ్యాహ్నం 2.59 గంటలకు ముహూర్తం
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్ ఎస్పీ టక్కర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం జూలై 21వ తేదీకల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి పూర్తిస్థాయిలో తరలివెళ్లనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సచివాయలంలోకి శాఖలు తరలివెళ్లడానికి బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ ముహూర్తానికి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలోని ఐదో బ్లాకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి నాలుగు శాఖలు తరలివెళ్తాయి. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, కార్మికశాఖ, గృహనిర్మాణ శాఖలు ఐదో భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించనున్నాయి. అలాగే జూలై 6న ఐదో భవనంలోని తొలి అంతస్తులోకి రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్ శాఖలు వెళ్తాయని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముహూర్త కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను ఉత్తర్వుల్లో సీఎస్ కోరారు.
జూలై 15, 21 తేదీల్లో మిగతా శాఖలు..
నిర్మాణంలో ఉన్న మిగతా నాలుగు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లలోకి జూలై 15న సాధారణ పరిపాలన, న్యాయ, ఇంధన-ఐఅండ్‌ఐ, పరి శ్రమలు, మున్సిపల్, ప్రభుత్వ రంగ, హోంశాఖల మంత్రులతోపాటు ఆయా శాఖలు, ఐటీ, కేంద్ర రికార్డుల రూమ్, రెవెన్యూ, పర్యావరణ, అటవీ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల మంత్రులు, ఆయా శాఖలు తరలివెళ్లనున్నాయి. జూలై 21న నాలుగు భవనాల్లోని తొలి అంతస్తుల్లోకి ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మిగతా శాఖలన్నీ ప్రవేశించనున్నాయి. ఒకటో భవనం తొలి అంతస్తులో ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం, సీఎస్, ఆయన కార్యాలయం వెళ్లనున్నాయి. అలాగే రెండు, మూడు, నాలుగు, ఐదో భవనాల్లోని అంతస్తుల్లోకి వివిధ శాఖల మంత్రులు, ఆయా శాఖలన్నీ తరలి వెళ్లనున్నాయి.
అమల్లోకి ఐదు రోజుల పనిదినాలు..
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లిన సచివాలయంతోపాటు, శాఖాధిపతుల ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు ఈనెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి తరలివెళ్లి నూనత రాజధాని ప్రాంతంలోను, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారానికి ఐదు రోజులు పనిదినాలు అమల్లోకి వస్తాయని, ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సీఎస్ పేర్కొన్నారు.