CS Tucker
-
హైదరాబాద్ నుంచి పనిచేస్తా: సీఎస్ టక్కర్
సీఎం చంద్రబాబుకు వినతి సాక్షి, అమరావతి: ఆరోగ్యం సహకరించడం లేదని, హైదరాబాద్ నుంచి పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ఇటీవల సీఎం చంద్రబాబుకు చెప్పారు. ప్రధాన సమావేశాలకు విజయవాడ వస్తానన్నారు. ఇందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సు అజెండాను టక్కర్ హైదరాబాద్ నుంచే చేపట్టారు. టక్కర్ పదవీ కాలం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంది. -
జూలై 21కి పూర్తిస్థాయిలో సచివాలయం
- వెలగపూడి సచివాలయానికి రేపు మధ్యాహ్నం 2.59 గంటలకు ముహూర్తం - ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్ ఎస్పీ టక్కర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం జూలై 21వ తేదీకల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి పూర్తిస్థాయిలో తరలివెళ్లనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సచివాయలంలోకి శాఖలు తరలివెళ్లడానికి బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ ముహూర్తానికి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలోని ఐదో బ్లాకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి నాలుగు శాఖలు తరలివెళ్తాయి. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, కార్మికశాఖ, గృహనిర్మాణ శాఖలు ఐదో భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించనున్నాయి. అలాగే జూలై 6న ఐదో భవనంలోని తొలి అంతస్తులోకి రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్ శాఖలు వెళ్తాయని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముహూర్త కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను ఉత్తర్వుల్లో సీఎస్ కోరారు. జూలై 15, 21 తేదీల్లో మిగతా శాఖలు.. నిర్మాణంలో ఉన్న మిగతా నాలుగు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లలోకి జూలై 15న సాధారణ పరిపాలన, న్యాయ, ఇంధన-ఐఅండ్ఐ, పరి శ్రమలు, మున్సిపల్, ప్రభుత్వ రంగ, హోంశాఖల మంత్రులతోపాటు ఆయా శాఖలు, ఐటీ, కేంద్ర రికార్డుల రూమ్, రెవెన్యూ, పర్యావరణ, అటవీ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల మంత్రులు, ఆయా శాఖలు తరలివెళ్లనున్నాయి. జూలై 21న నాలుగు భవనాల్లోని తొలి అంతస్తుల్లోకి ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మిగతా శాఖలన్నీ ప్రవేశించనున్నాయి. ఒకటో భవనం తొలి అంతస్తులో ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం, సీఎస్, ఆయన కార్యాలయం వెళ్లనున్నాయి. అలాగే రెండు, మూడు, నాలుగు, ఐదో భవనాల్లోని అంతస్తుల్లోకి వివిధ శాఖల మంత్రులు, ఆయా శాఖలన్నీ తరలి వెళ్లనున్నాయి. అమల్లోకి ఐదు రోజుల పనిదినాలు.. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లిన సచివాలయంతోపాటు, శాఖాధిపతుల ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు ఈనెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి తరలివెళ్లి నూనత రాజధాని ప్రాంతంలోను, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారానికి ఐదు రోజులు పనిదినాలు అమల్లోకి వస్తాయని, ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సీఎస్ పేర్కొన్నారు. -
‘తరలింపు’ ఏడాది వాయిదా వేయండి
- తరలింపుపై సీఎంకు హెచ్‌వోడీల విన్నపం - 27కు రావాల్సిందేనన్న సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని తరలింపు మరో ఏడాది వాయిదా వేయాలని, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి కచ్చితమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని రాష్ట ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాల(హెచ్ఓడీ)ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఉన్నపళంగా తాత్కాలిక సచివాలయానికి వెళ్లాలని తమకు నోటీసులు ఇచ్చారని, కుటుంబాలపరంగా అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని చక్కబెట్టుకుని వచ్చేందుకు గడువు ఇవ్వాలని కోరారు. పలు హెచ్ఓడీలకు చెందిన 20 మంది ఉద్యోగుల బృందం శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలసి తమ డిమాండ్లపై వినతిపత్రం అందించి సమస్యలను వివరించారు. ఈ ఏడాది మార్చిలో మంత్రి నారాయణ తమ ఉద్యోగులతో సమావేశం నిర్వహించినప్పుడు.. రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని, అలాగే ఏ డిపార్టుమెంటు ఆఫీసులను, సిబ్బందిని ఎక్కడికి తరలించేది మార్గదర్శకాలు ఇస్తామని హామీ ఇచ్చారని వారు సీఎంకు గుర్తుచేశారు. తమ కార్యాలయం ఎక్కడ వస్తుందో ముందు తెలిస్తే దానికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకోవడం, పిల్లల చదువులకు విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవడం వీలవుతుందని వివరించారు. ఇలాంటి అనేక ఇబ్బందులను పరిష్కరించేందుకు అన్ని శాఖల ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేయాలన్న తమ విజ్ఞాపన అమలు కాలేదని వారు సీఎం దృష్టికి తెచ్చారు. అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జూన్ 27కు కచ్చితంగా ఉద్యోగులు తరలిరావాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని, సమస్యలుంటే పరిశీలిస్తానని సీఎం వారికి చెప్పారు. కాగా, ఉద్యోగులతో సంప్రదించకుండా నోటీసులిచ్చి తక్షణం అమరావతి వెళ్లిపోమంటే ఎలాగని, ఏడాది కుదరకుంటే కనీసం ఆరునెలలైనా గడువివ్వాలని సీఎం చంద్రబాబుకు విన్నవించినట్టు ఉద్యోగుల ప్రతినిధి బృందం మీడియా సమావేశంలో పేర్కొంది. తాము చెప్పిన విషయాలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. కొత్త రాజధానికి రావడానికి ఉద్యోగులు వ్యతిరేకంగా లేరని, తమ సమస్యలు పరిష్కరిస్తే సీఎం చెప్పినట్టు చెట్లు కింద కూర్చుని పనిచేయడానికి కూడా సిద్ధమని వారు తెలిపారు. కృష్ణా పుష్కరాలతో ప్రతిష్ట పెరగాలి కృష్ణా పుష్కరాల్లో రాష్ట్ర నూతన రాజధాని ప్రతిష్టను ద్విగుణీకృతం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చేపట్టిన పుష్కర పనులను ఆయన సమీక్షించారు. కృష్ణా పుష్కరాల లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు. ‘తరలింపు’పై ఇద్దరు ఐఏఎస్‌లతో కమిటీ సాక్షి, హైదరాబాద్: సచివాలయ శాఖలు, ఉద్యోగులతో పాటు, శాఖాధిపతుల ఉద్యోగులను అమరావతికి తరలించేందుకు సీఎస్ టక్కర్ ఇద్దరు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సీనియర్ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఉన్నారు. ఈ కమిటీ తరలింపునకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొం దించడంతో పాటు తరలింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమన్వయం చేయనుంది. వీరిద్దరూ శుక్రవారం ప్రాథమికంగా సమావేశమై చర్చించారు. కాగా, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కలిసి ఇప్పటికే పిల్లలను అమరావతి ప్రాంతంలో విద్యా సంస్థల్లో చేర్పించడానికి ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులను వెంటనే పంపించేయాలని కోరారు. -
హడావుడిగా వెళ్లమంటే ఎలా?
- సచివాలయ తరలింపుపై ఉద్యోగుల ఆందోళన - సమస్యలు పరిష్కరించి,కార్యాచరణకు డిమాండ్ - సచివాలయంలో ఉద్యోగుల ప్రదర్శన.. సీఎస్‌కు వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించకుండా హడావుడిగా కొత్త రాజధాని వెలగపూడికి వెళ్లమంటే ఎలా..? ముందు సమస్యలు పరిష్కరించి తర్వాత సచివాలయం తరలింపుపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు పభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరలింపు ఎప్పుడు అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని, కొందరు ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాలని, విజయవాడలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, విద్యార్థులకు అడ్మిషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌కు వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు మధ్యాహ్నం సచివాలయంలోని హెచ్ బ్లాక్‌లో ‘సచివాలయం తరలింపు’ అంశంపై సచివాలయ ఉద్యోగ సంఘం సమావేశమైంది. సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, సంఘం నేతలు వెంకట్రామిరెడ్డి, బాబూరావు సాహెబ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు మాట్లాడారు. ఏపీకి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని, రోడ్ మ్యాప్ ఇవ్వకుండా ఈ నెల 27న అందరూ వెళ్లిపోవాలంటే ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నించా రు. ముందుగా రోడ్ మ్యాప్ ప్రకటించి ఉద్యోగులను విడతలుగా తరలించాలని డిమాండ్ చేశారు. తరలింపుపై సోమవారంలోగా స్పష్టత ఇవ్వని పక్షంలో మంగళవారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం వారు ప్రదర్శనగా ఎల్ బ్లాకులోని సీఎస్ చాంబరు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. సీఎస్‌కు వినతిపత్రం ఉద్యోగులను బలవంతంగా తరలించే పరిస్థితిని సృష్టించవద్దని, వ్యక్తిగత సమస్యలున్న వారికి కొంత కాలం హైదరాబాద్‌లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సీఎస్ బయటకు రావాలని ఉద్యోగులు గట్టిగా నినాదాలు చేయడంతో ఆయన బయటకు వచ్చి వారి సమస్యలు విన్నారు. -
జీఎంఆర్‌కు జీ హుజూర్!
కాకినాడ సెజ్ భూములపై సర్వహక్కులు కల్పించేందుకు సీఎం చంద్రబాబు యత్నం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం భూముల దందా కొనసాగుతోంది. స్వయం గా సీఎం చంద్రబాబే ఇందుకు తెరలేపారు. రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల భూముల్ని బడా పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు అమ్మేయడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. రాజధాని పేరిట రైతుల నుంచి సమీకరించిన వేలాది ఎకరాల భూములను ఇప్పటికే రియల్ ఎస్టేట్ కోసం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్న సీఎం.. మరోవైపు గతంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) కోసం ఎవరికైతే లీజుపై భూములను కేటాయించారో వారికే ఆ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. తొలిదశలో జీఎంఆర్ సంస్థతో చినబాబు డీల్ కుదుర్చుకోవడంతో సీఎం హోదాలో చంద్రబాబు ఫైలును నడిపించారు. ఆ ఫైలుకు ఆమోదం పొందేందుకు 2 కేబినెట్ సమావేశాల్లో విశ్వప్రయత్నం చేశారు. అయితే భూముల విక్రయ హక్కులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రతిపాదనను ఈ నెల 2న జరిగిన కేబినెట్ భేటీలో సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్‌తో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తిరిగి ఈ నెల 18న జరిగిన మంత్రివర్గ భేటీలో సైతం ఈ ఫైలుకు ఆమోద ముద్ర వేయించాలని సీఎం ప్రయత్నించారు. ఆర్థిక మంత్రి యనమల మెత్తబడినప్పటికీ సీఎస్ మాత్రం ఈ భేటీలోనూ ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రస్తుతానికి ఆ ఫైలును పెండింగ్‌లో ఉంచాలని సీఎం నిర్ణయించారు. 2003లోనే భూములు కేటాయించిన బాబు కాకినాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 2003లో బాబే భూములు కేటాయించారు. దీనికి సెజ్ హోదా కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అనంతరం కేంద్రం సెజ్ హోదా కల్పించింది. 2011లో కాకినాడ సెజ్ జీఎంఆర్ పరమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోనలో కాకినాడ సెజ్ భూములున్నాయి. బాబు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 మే 13న కాకినాడ సెజ్ భూమిని పారిశ్రామిక పార్కు/పోర్టు, పరిశ్రమల బ్యాకప్ ఏరియా కోసం లీజుకు బదులు పూర్తిస్థాయిలో జీఎంఆర్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. లీజుకు బదులు నిబంధనలు, షరతులతో మార్కెట్ ధర మేరకు ఈ భూములను ఎకరం రూ. 3 లక్షల చొప్పున కాకినాడ సెజ్‌కు విక్రయించారు. అయితే నిబంధనలు పాటిం చాలంటే పరిశ్రమల స్థాపనకు ఎవరూ రావడం లేదని, అందువల్ల 1,589.74 ఎకరాలపై తమకు సర్వహక్కులు కల్పించాలని జీఎంఆర్ ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)ను కోరింది. చినబాబు డీల్ నేపథ్యంలో.. జీఎంఆర్ కోరిన మేరకు ఫైలు సిద్ధం చేయాలని ప్రభుత్వ పెద్ద ఆదేశించడంతో ఏపీఐఐసీ కాకినాడ సెజ్‌ను డీ నోటిఫై చేసింది. ఆ భూములపై సర్వహక్కులను జీఎంఆర్‌కు కట్టబెట్టే విధంగా ఫైలును సిద్ధం చేసింది. అంటే డీ నోటిఫై చేసిన 1,589.74 ఎకరాల్ని తిరిగి జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్కే రిజిస్ట్రేషన్‌తో సహా విక్రయించేందుకు ఫైలును సిద్ధం చేశారు. అయితే ఈ ఫైలును కేబినెట్ ఆమోదానికి పంపేందుకూ సీఎస్ అంగీకరించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఆ భూములపై జీఎంఆర్‌కు హక్కులు కల్పిస్తే భవిష్యత్‌లో ఆ సంస్థ ఎవరికి పడితే వారికి ఏ అవసరానికైనా ఆ భూములను విక్రయించుకోవచ్చునన్నారు. సెజ్ పోర్టుకు దగ్గరలో ఉన్నందున విదేశీ సంస్థలకు ఆ భూములను విక్రయిస్తే దేశ సార్వభౌమాధికారానికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా టక్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. పేదల భూములు విక్రయించేందుకు అంగీకరించనన్న సీఎస్ కాకినాడ సెజ్‌కు కేటాయించిన 1,589.74 ఎకరాల్లో 1,396.91 ఎకరాలు అసైన్డ్ భూమితో పాటు 72 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి మొత్తాన్ని పరిశ్రమల కోసం అంటూ రైతుల నుంచి సేకరించి కాకినాడ సెజ్‌కు లీజుకు ఇచ్చారు. రైతుల నుంచి, ప్రధానంగా పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను సేకరించి ఈ విధంగా విక్రయించేందుకు అనుమతించడాన్ని అంగీకరించబోనని సీఎస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నెల 2న విజయవాడలో జరిగిన మంత్రివర్గ భేటీలో కాకినాడ సెజ్ భూముల డీ నోటిఫై, జీఎంఆర్‌కు ఆ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ విక్రయించే అంశాన్ని నేరుగా ప్రస్తావించారు. ఈ సమావేశంలోనే బాహాటంగా సీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి యనమల కూడా రైతుల నుంచి సేకరించిన భూముల్ని ఈ విధంగా ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తే మిగతా సెజ్‌లూ ఇదేవిధంగా ఇవ్వాలని కోరతాయంటూ కొర్రీ వేశారు. దీనిపై అప్పటికి వెనక్కు తగ్గిన సీఎం మళ్లీ ఈ నెల 18న మంత్రివర్గ భేటీలో కాకినాడ సెజ్ అంశం ప్రస్తావించారు. సర్వహక్కులు కల్పించకపోతే పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఇలాగైతే ఎలాగంటూ ప్రశ్నించారు. 2న మంత్రివర్గ భేటీ లో వ్యతిరేకించిన యనమల 18న జరిగిన భేటీలో మౌనం వహించారు. సీఎస్ టక్కర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనలకు అంగీకరించబోనని స్పష్టం చేశారు. నిబంధనలకు పూర్తి విరుద్ధమైన ప్రతిపాదనలు చేశారని, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బోనులో నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. మిగతా మంత్రులు కూడా ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో చంద్రబాబు ఈ ప్రతిపాదనలు తిరస్కరించకుండా ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టాలంటూ సూచించారు.