హడావుడిగా వెళ్లమంటే ఎలా?
- సచివాలయ తరలింపుపై ఉద్యోగుల ఆందోళన
- సమస్యలు పరిష్కరించి,కార్యాచరణకు డిమాండ్
- సచివాలయంలో ఉద్యోగుల ప్రదర్శన.. సీఎస్‌కు వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించకుండా హడావుడిగా కొత్త రాజధాని వెలగపూడికి వెళ్లమంటే ఎలా..? ముందు సమస్యలు పరిష్కరించి తర్వాత సచివాలయం తరలింపుపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు పభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరలింపు ఎప్పుడు అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని, కొందరు ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాలని, విజయవాడలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, విద్యార్థులకు అడ్మిషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌కు వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.
అంతకుముందు మధ్యాహ్నం సచివాలయంలోని హెచ్ బ్లాక్‌లో ‘సచివాలయం తరలింపు’ అంశంపై సచివాలయ ఉద్యోగ సంఘం సమావేశమైంది. సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, సంఘం నేతలు వెంకట్రామిరెడ్డి, బాబూరావు సాహెబ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు మాట్లాడారు. ఏపీకి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని, రోడ్ మ్యాప్ ఇవ్వకుండా ఈ నెల 27న అందరూ వెళ్లిపోవాలంటే ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నించా రు. ముందుగా రోడ్ మ్యాప్ ప్రకటించి ఉద్యోగులను విడతలుగా తరలించాలని డిమాండ్ చేశారు. తరలింపుపై సోమవారంలోగా స్పష్టత ఇవ్వని పక్షంలో మంగళవారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం వారు ప్రదర్శనగా ఎల్ బ్లాకులోని సీఎస్ చాంబరు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు.
సీఎస్‌కు వినతిపత్రం
ఉద్యోగులను బలవంతంగా తరలించే పరిస్థితిని సృష్టించవద్దని, వ్యక్తిగత సమస్యలున్న వారికి కొంత కాలం హైదరాబాద్‌లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సీఎస్ బయటకు రావాలని ఉద్యోగులు గట్టిగా నినాదాలు చేయడంతో ఆయన బయటకు వచ్చి వారి సమస్యలు విన్నారు.