‘తరలింపు’ ఏడాది వాయిదా వేయండి
- తరలింపుపై సీఎంకు హెచ్‌వోడీల విన్నపం
- 27కు రావాల్సిందేనన్న సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని తరలింపు మరో ఏడాది వాయిదా వేయాలని, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి కచ్చితమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని రాష్ట ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాల(హెచ్‌ఓడీ)ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఉన్నపళంగా తాత్కాలిక సచివాలయానికి వెళ్లాలని తమకు నోటీసులు ఇచ్చారని, కుటుంబాలపరంగా అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని చక్కబెట్టుకుని వచ్చేందుకు గడువు ఇవ్వాలని కోరారు. పలు హెచ్‌ఓడీలకు చెందిన 20 మంది ఉద్యోగుల బృందం శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలసి తమ డిమాండ్లపై వినతిపత్రం అందించి సమస్యలను వివరించారు.
ఈ ఏడాది మార్చిలో మంత్రి నారాయణ తమ ఉద్యోగులతో సమావేశం నిర్వహించినప్పుడు.. రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని, అలాగే ఏ డిపార్టుమెంటు ఆఫీసులను, సిబ్బందిని ఎక్కడికి తరలించేది మార్గదర్శకాలు ఇస్తామని హామీ ఇచ్చారని వారు సీఎంకు గుర్తుచేశారు. తమ కార్యాలయం ఎక్కడ వస్తుందో ముందు తెలిస్తే దానికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకోవడం, పిల్లల చదువులకు విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవడం వీలవుతుందని వివరించారు. ఇలాంటి అనేక ఇబ్బందులను పరిష్కరించేందుకు అన్ని శాఖల ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేయాలన్న తమ విజ్ఞాపన అమలు కాలేదని వారు సీఎం దృష్టికి తెచ్చారు.
అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జూన్ 27కు కచ్చితంగా ఉద్యోగులు తరలిరావాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని, సమస్యలుంటే పరిశీలిస్తానని సీఎం వారికి చెప్పారు. కాగా, ఉద్యోగులతో సంప్రదించకుండా నోటీసులిచ్చి తక్షణం అమరావతి వెళ్లిపోమంటే ఎలాగని, ఏడాది కుదరకుంటే కనీసం ఆరునెలలైనా గడువివ్వాలని సీఎం చంద్రబాబుకు విన్నవించినట్టు ఉద్యోగుల ప్రతినిధి బృందం మీడియా సమావేశంలో పేర్కొంది. తాము చెప్పిన విషయాలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. కొత్త రాజధానికి రావడానికి ఉద్యోగులు వ్యతిరేకంగా లేరని, తమ సమస్యలు పరిష్కరిస్తే సీఎం చెప్పినట్టు చెట్లు కింద కూర్చుని పనిచేయడానికి కూడా సిద్ధమని వారు తెలిపారు.
కృష్ణా పుష్కరాలతో ప్రతిష్ట పెరగాలి
కృష్ణా పుష్కరాల్లో రాష్ట్ర నూతన రాజధాని ప్రతిష్టను ద్విగుణీకృతం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చేపట్టిన పుష్కర పనులను ఆయన సమీక్షించారు. కృష్ణా పుష్కరాల లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు.
‘తరలింపు’పై ఇద్దరు ఐఏఎస్‌లతో కమిటీ
సాక్షి, హైదరాబాద్: సచివాలయ శాఖలు, ఉద్యోగులతో పాటు, శాఖాధిపతుల ఉద్యోగులను అమరావతికి తరలించేందుకు సీఎస్ టక్కర్ ఇద్దరు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సీనియర్ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఉన్నారు. ఈ కమిటీ తరలింపునకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొం దించడంతో పాటు తరలింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమన్వయం చేయనుంది. వీరిద్దరూ శుక్రవారం ప్రాథమికంగా సమావేశమై చర్చించారు. కాగా, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కలిసి ఇప్పటికే పిల్లలను అమరావతి ప్రాంతంలో విద్యా సంస్థల్లో చేర్పించడానికి ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులను వెంటనే పంపించేయాలని కోరారు.