జీఎంఆర్‌కు జీ హుజూర్!
కాకినాడ సెజ్ భూములపై సర్వహక్కులు కల్పించేందుకు సీఎం చంద్రబాబు యత్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం భూముల దందా కొనసాగుతోంది. స్వయం గా సీఎం చంద్రబాబే ఇందుకు తెరలేపారు. రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల భూముల్ని బడా పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు అమ్మేయడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. రాజధాని పేరిట రైతుల నుంచి సమీకరించిన వేలాది ఎకరాల భూములను ఇప్పటికే రియల్ ఎస్టేట్ కోసం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్న సీఎం.. మరోవైపు గతంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) కోసం ఎవరికైతే లీజుపై భూములను కేటాయించారో వారికే ఆ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు.
తొలిదశలో జీఎంఆర్ సంస్థతో చినబాబు డీల్ కుదుర్చుకోవడంతో సీఎం హోదాలో చంద్రబాబు ఫైలును నడిపించారు. ఆ ఫైలుకు ఆమోదం పొందేందుకు 2 కేబినెట్ సమావేశాల్లో విశ్వప్రయత్నం చేశారు. అయితే భూముల విక్రయ హక్కులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రతిపాదనను ఈ నెల 2న జరిగిన కేబినెట్ భేటీలో సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్‌తో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తిరిగి ఈ నెల 18న జరిగిన మంత్రివర్గ భేటీలో సైతం ఈ ఫైలుకు ఆమోద ముద్ర వేయించాలని సీఎం ప్రయత్నించారు. ఆర్థిక మంత్రి యనమల మెత్తబడినప్పటికీ సీఎస్ మాత్రం ఈ భేటీలోనూ ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రస్తుతానికి ఆ ఫైలును పెండింగ్‌లో ఉంచాలని సీఎం నిర్ణయించారు.
2003లోనే భూములు కేటాయించిన బాబు
కాకినాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 2003లో బాబే భూములు కేటాయించారు. దీనికి సెజ్ హోదా కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అనంతరం కేంద్రం సెజ్ హోదా కల్పించింది. 2011లో కాకినాడ సెజ్ జీఎంఆర్ పరమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోనలో కాకినాడ సెజ్ భూములున్నాయి. బాబు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 మే 13న కాకినాడ సెజ్ భూమిని పారిశ్రామిక పార్కు/పోర్టు, పరిశ్రమల బ్యాకప్ ఏరియా కోసం లీజుకు బదులు పూర్తిస్థాయిలో జీఎంఆర్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
లీజుకు బదులు నిబంధనలు, షరతులతో మార్కెట్ ధర మేరకు ఈ భూములను ఎకరం రూ. 3 లక్షల చొప్పున కాకినాడ సెజ్‌కు విక్రయించారు. అయితే నిబంధనలు పాటిం చాలంటే పరిశ్రమల స్థాపనకు ఎవరూ రావడం లేదని, అందువల్ల 1,589.74 ఎకరాలపై తమకు సర్వహక్కులు కల్పించాలని జీఎంఆర్ ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)ను కోరింది. చినబాబు డీల్ నేపథ్యంలో.. జీఎంఆర్ కోరిన మేరకు ఫైలు సిద్ధం చేయాలని ప్రభుత్వ పెద్ద ఆదేశించడంతో ఏపీఐఐసీ కాకినాడ సెజ్‌ను డీ నోటిఫై చేసింది. ఆ భూములపై సర్వహక్కులను జీఎంఆర్‌కు కట్టబెట్టే విధంగా ఫైలును సిద్ధం చేసింది. అంటే డీ నోటిఫై చేసిన 1,589.74 ఎకరాల్ని తిరిగి జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్‌కే రిజిస్ట్రేషన్‌తో సహా విక్రయించేందుకు ఫైలును సిద్ధం చేశారు.
అయితే ఈ ఫైలును కేబినెట్ ఆమోదానికి పంపేందుకూ సీఎస్ అంగీకరించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఆ భూములపై జీఎంఆర్‌కు హక్కులు కల్పిస్తే భవిష్యత్‌లో ఆ సంస్థ ఎవరికి పడితే వారికి ఏ అవసరానికైనా ఆ భూములను విక్రయించుకోవచ్చునన్నారు. సెజ్ పోర్టుకు దగ్గరలో ఉన్నందున విదేశీ సంస్థలకు ఆ భూములను విక్రయిస్తే దేశ సార్వభౌమాధికారానికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా టక్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.
పేదల భూములు విక్రయించేందుకు అంగీకరించనన్న సీఎస్
కాకినాడ సెజ్‌కు కేటాయించిన 1,589.74 ఎకరాల్లో 1,396.91 ఎకరాలు అసైన్డ్ భూమితో పాటు 72 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి మొత్తాన్ని పరిశ్రమల కోసం అంటూ రైతుల నుంచి సేకరించి కాకినాడ సెజ్‌కు లీజుకు ఇచ్చారు. రైతుల నుంచి, ప్రధానంగా పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను సేకరించి ఈ విధంగా విక్రయించేందుకు అనుమతించడాన్ని అంగీకరించబోనని సీఎస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నెల 2న విజయవాడలో జరిగిన మంత్రివర్గ భేటీలో కాకినాడ సెజ్ భూముల డీ నోటిఫై, జీఎంఆర్‌కు ఆ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ విక్రయించే అంశాన్ని నేరుగా ప్రస్తావించారు.
ఈ సమావేశంలోనే బాహాటంగా సీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి యనమల కూడా రైతుల నుంచి సేకరించిన భూముల్ని ఈ విధంగా ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తే మిగతా సెజ్‌లూ ఇదేవిధంగా ఇవ్వాలని కోరతాయంటూ కొర్రీ వేశారు. దీనిపై అప్పటికి వెనక్కు తగ్గిన సీఎం మళ్లీ ఈ నెల 18న మంత్రివర్గ భేటీలో కాకినాడ సెజ్ అంశం ప్రస్తావించారు. సర్వహక్కులు కల్పించకపోతే పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఇలాగైతే ఎలాగంటూ ప్రశ్నించారు. 2న మంత్రివర్గ భేటీ లో వ్యతిరేకించిన యనమల 18న జరిగిన భేటీలో మౌనం వహించారు. సీఎస్ టక్కర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనలకు అంగీకరించబోనని స్పష్టం చేశారు. నిబంధనలకు పూర్తి విరుద్ధమైన ప్రతిపాదనలు చేశారని, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బోనులో నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. మిగతా మంత్రులు కూడా ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో చంద్రబాబు ఈ ప్రతిపాదనలు తిరస్కరించకుండా ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టాలంటూ సూచించారు.