గవర్నర్, సీఎం ఏకాంత చర్చలు
- సచివాలయ భవనాల అప్పగింత, మంత్రివర్గ విస్తరణపై చర్చ
- సంస్థల విభజన, ఆస్తుల పంపకంలో అన్యాయం చేయొద్దన్న సీఎం
- తాను చర్చించి పరిష్కరిస్తానని నరసింహన్ హామీ
- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకోవద్దని సూచన
- తలసానితో ప్రమాణ స్వీకారం చేయిస్తే నాపై రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేశారు
- తెలంగాణలో నా చర్యను టీడీపీ నేతలు తప్పుపట్టారు
- ఏపీలోనూ అదే పని చేయించి ఇతరులు తప్పు పట్టేలా చేయొద్దు
- తెలంగాణకు సచివాలయ భవనాల అప్పగింతకు బాబు ఓకే?
సాక్షి, అమరావతి: హైదరాబాద్ సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించడం, విభజన చట్టంలో పేర్కొన్న తొమ్మిది, పది షెడ్యూళ్ల ప్రకారం ఆస్తుల పంపకాలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం చంద్రబాబు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో చర్చిం చారు. ఆయన శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో గవర్నర్‌తో గంటన్నరకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. గవర్నర్ గురువారం సాయంత్రం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినంలో పాల్గొన్నారు. అనంతరం తాను బస చేసిన హోటల్‌కు చేరుకున్నారు.కొద్ది సేపటికి సీఎం, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వెంటబెట్టుకుని వచ్చి గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌కు శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురూ భేటీ అయ్యారు.
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తాం..
రెండున్నర గంటలపాటు సాగిన భేటీలో పాలన, ప్రభుత్వ అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల కేటాయింపు పూర్తి కాలేదని, వాటి గూర్చి తేల్చాలని బాబు గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. ఈ షెడ్యూళ్లలో పొందుపరిచిన సంస్థల వద్ద రూ.వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, ఆస్తుల విలువ పెద్ద మొత్తంలో ఉన్నం దున తమకు అన్యాయం జరగకుండా ఆ సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు కోరగా, తాను చర్చించి సమస్యను పరిష్కరిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని అధికార వర్గాల సమాచారం. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉన్నా రాజకీయ కోణంలోనే తెలంగాణ, ఏపీలకు ఈ సమస్యను ట్రిబ్యునల్ పరిమితం చేసిందని గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇప్పుడు అదే పని నాతో చేయిస్తారా?!
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా గవర్నర్, ముఖ్యమంత్రి చర్చించారు. నవంబర్ రెండో వారంలోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే చర్చ సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక సంఘం స్టేడియంలో చేపడతామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తన కుమారుడు నారా లోకేశ్‌ను మంత్రివర్గంలో చేర్చుకునే అంశాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించవద్దని చంద్రబాబుకు గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరి, మంత్రి పదవి దక్కించుకోవడాన్ని గవర్నర్ ప్రస్తావించినట్లు తెలిసింది. తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై మీరు(టీడీపీ) రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదులు చేశారు. అక్కడ(తెలంగాణలో) నా చర్యను తప్పు పట్టారు, ఇప్పుడు మీరు ఇక్కడ(ఏపీలో) అదే పని నాతో చేయించి ఇతరులు తప్పుపట్టేలా చేయవద్దని గవర్నర్ అన్నట్లు సమాచారం.
ఖాళీగా ఉంచే కంటే ఇచ్చేస్తే బెటర్
హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించడంపై నరసింహన్, బాబు చర్చించారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఇటీవల తనను కలసి, తాము కొత్త సచివాలయం నిర్మించుకోవాలని నిర్ణయించామని, ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించేలా చూడాలని కోరారని గవర్నర్ చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తమ సచివాలయాన్ని వెలగపూడిలో ఏర్పాటు చేసుకోవటంతోపాటు హైదరాబాద్‌లో ఉన్న సిబ్బంది, ఫైళ్లను తరలించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న సచివాలయానికి తాళాలు వేసి, నిరుపయోగంగా ఉంచే బదులు తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది కాబట్టి వారికి అప్పగించేసి, ఢిల్లీలో ఏపీ భవన్ మాదిరిగా హైదరాబాద్‌కు ఏపీ మంత్రులు, అధికారులు వచ్చినప్పుడు బస చేసేందుకు ఏదైనా ఒక భవనాన్ని కేటాయించడం లేదా నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే మంచిదని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వం, పార్టీలో చ ర్చించి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు బదులిచ్చినట్లు సమాచారం.
‘హోదా’కు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం: చంద్రబాబు
పొరుగు రాష్ట్రాలతో గొడవల వల్ల లాభం లేదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు ఆయన శుక్రవారం గవర్నర్‌తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాము రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడను. అనవసరంగా మాట్లాడి గొడవలు పెట్టుకోను. ప్రభుత్వ పరిపాలన తీరు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదిస్తున్నాం. నేను కొద్ది రోజులుగా గవర్నర్‌తో భేటీ కాకపోవటంతో ఈసారి ఎక్కువసేపు సమావేశమయ్యా. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో ఉన్న భవనాల అప్పగింతపై చర్చించాం. ప్రభుత్వం, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం. పెట్రోలియం శాఖ రాష్ట్రంలో రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. పునరావాసానికి రూ.25 వేల కోట్లు అవసరం. కేంద్రం నుంచి రూ.పది ఎక్కువ రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ముందు మీడియాకే చెబుతాగా!
‘‘అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమాన హోదా సాధించే వరకూ సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా. ఏపీ 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ కట్టుకునేందుకు తమిళనాడు అభ్యంతరం చెప్పింది. వారితో గొడవలు పడకుండా ఉండేందుకే వారి తాగునీటికి 3టీఎంసీల నీరు అందిస్తున్నాం’’ అని వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌తో చర్చించారా? అని ప్రశ్నించగా... ఉంటే ముందు మీకే చెబుతాగా అని బాబు అన్నారు. దీపావళికి కొత్త మంత్రులను చూడవచ్చా? అని అడగ్గా... స్పందించలేదు. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలోని ఫైళ్లను తెలంగాణ సర్కారు తీసుకెళుతోందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారని ఓ విలేకరి గుర్తుచేయగా... అది ఎవరు చేసినా తప్పేనని, తాము ప్రభుత్వపరంగా భద్రత కల్పిస్తామని సీఎం చె ప్పారు.
సమస్యలుంటే పరిష్కరించుకుంటారు: నరసింహన్
భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలుంటే చర్చ ల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరిం చుకుంటారని చెప్పారు. రెండు రాష్ట్రాలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. విభజన చట్టంలో తొమ్మిది నుంచి పదిహేను వరకూ అన్ని షెడ్యూళ్లలోని అంశాలపై సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించుకుంటారని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై తాము చర్చించలేదన్నారు. ఏపీ సచివాలయాన్ని తెలంగాణకు అప్పగించాలన్న ప్రతిపాదన రాలేదని, వస్తే తగిన సమయం లో చర్చిస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలన్నీ మీరు(మీడియా) సృష్టించినవే అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.