‘హోదా’ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు
* ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే మూల్యం చెల్లించుకుంటారు
* కేంద్రానికి సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు. ఏపీని అన్నిరకాలుగా ఆదుకుంటామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి.. లేకుంటే పర్యవసానాలను అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రాన్ని హెచ్చరించారు. బాలకృష్ణ గురువారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో రాష్ట్ర కార్మిక,యువజన క్రీడల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు.
ఈ సందర్భంగా హిందూపురంలో స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులతోపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఎవర్నీ బతిమాలాల్సిన అవసరం లేదన్నారు. ‘‘మనం అప్పుడప్పుడూ అంటూ ఉంటాం.. దేనికో ఈ దిక్కుమాలిన జోహార్లు.. దేనికో సిగ్గులేని దేబిరింపులు.. ఎందుకో రాష్ట్ర లబ్ధికై ఇంత రగడ. యాచన అన్నదే ఎరుగని ఆంధ్రరాష్ట్రం ఎంత దిగజారిపోయింది. ఎంత వింత సిగ్గుచేటు.. ఇదిగో.. మన భుక్తి మన చేతియందేగలదు. ముష్టి ఎత్తుకొనుట యందుకాదు’’ అంటూ తన వాక్చాతుర్యంతో బీజేపీపై మండిపడ్డారు.