
సాక్షి, అమరావతి : భూమి కోసం కన్నకొడుకులే కనికరం లేకుండా ప్రవర్తించారు. తల్లి బతికుండగానే.. ఆమె చనిపోయిందంటూ డెత్ సర్టిఫికేట్ తీసుకొని.. భూమి తమ పరం చేసుకున్నారు. భూమి లాక్కున్న విషయం తెలియడంతో ఆ తల్లి తల్లిడిల్లిపోయింది. కన్నకొడుకుల చర్యకు దిగ్భ్రాంతి చెందింది. తనకు న్యాయం చేయాలంటూ అమరావతిలో ఏపీ సచివాలయం ఎదుట నడిరోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెను పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తరలించారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామానికి చెందిన నరసమ్మ తన పేరిట ఉన్న 90 సెంట్ల భూమిని తన ఇద్దరు కొడుకులు లాక్కున్నారని ఏపీ సచివాలయం ఎదుట ఆందోళన దిగారు. తను బతికుండగానే.. అక్రమంగా బూకటపు డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. వీఆర్‌వో వద్ద భూమిని తమ పేరిట బదలాయించుకున్నారని ఆమె వెల్లడించారు. అధికారులకు విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చానని, గతంలో పలుమార్లు అధికారులను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించిన ఆమెను బలవంతంగా పోలీసులు అక్కడికి నుంచి బయటకు పంపేశారు.