ఉద్యోగుల తరలింపులో అధికారుల వైఫల్యం | The failure of the authorities to move employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల తరలింపులో అధికారుల వైఫల్యం

Published Tue, Jun 7 2016 1:43 AM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

ఉద్యోగుల తరలింపులో అధికారుల వైఫల్యం - Sakshi

ఉద్యోగుల తరలింపులో అధికారుల వైఫల్యం

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ
 
 సాక్షి, హైదరాబాద్: సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశంలో అధికారులు వైఫల్యం చెందారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విమర్శించారు. సోమవారం ఆయన సచివాలయ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. వెలగపూడికి ఉద్యోగులను తరలింపునకు నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడానికి అధికారులే కారణమన్నారు. తరలింపులో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని.. రాబోయే 5,6 నెలలు ఉద్యోగులకు గడ్డు కాలమని చెప్పారు. తరలింపును మూడు నెలలు వాయిదా వేసినంత మాత్రాన ఆ సమస్యలన్నీ తీరవని స్పష్టం చేశారు. జూన్ 27 నుంచి వెలగపూడి నుండి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారని, దానికనుగుణంగా కొత్త రాజధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుందని భావిస్తున్నామన్నారు. తాత్కాలిక సచివాలయంలో భవన నిర్మాణాలను బట్టి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. కొత్త రాజధానిలో అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించాలంటే సాధ్యం కాదని.. ఉద్యోగులు కూడా కొంతమేరకు సర్దుకుపోవాలని సూచించారు. ఉద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్‌కు హితవు పలికారు. ప్రస్తుతం వేతనం తగ్గకుండా హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సీఎంను కోరామని.. త్వరలో స్థానికత, 30 శాతం హెచ్‌ఆర్‌ఏపై జీవో విడుదల చేసే అవకాశముందని చెప్పారు. సెప్టెంబరు నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని.. పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు మురళీకృష్ణ తెలిపారు.
 
 ఉద్యోగుల్లో ‘తరలింపు’ గందరగోళం
 ఏపీ సచివాలయం ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల 27కల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లాలన్న ఆదేశాలపై గందరగోళం నెలకొందని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించడంలో ఉద్యోగ సంఘ నాయకులు విఫలం కావడమే ఈ అయోమయ పరిస్థితికి కారణమని ఏపీ సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు.. స్థానికత అంశం తేల్చలేదు.. కొత్త రాజధానిలో ఉద్యోగులకు వసతి కల్పించలేదు.. తాత్కాలిక సచివాలయ భవనాలు పూర్తి కాలేదు.. రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సౌకర్యాలను కల్పించలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో తరలింపు ఉంటుందా అని ఉద్యోగులు మధనపడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇవేవి పట్టించుకోకుండా మీడియాలో మైకు దొరికినప్పడల్లా జూన్‌కు తరలిరావడానికి మేం సిద్ధం అని చెప్పడాన్ని ఆక్షేపించారు. కొత్త రాజధానికి వెళ్లడానికి అభ్యంతరం లేదని, అయితే దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు.

 పిల్లల గురించి అడిగితే గొంతెమ్మ కోరికా?: కృష్ణయ్య
 పిల్లల స్థానికత గురించి తాము ఏడాది నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, అది గొంతెమ్మ కోరిక అవుతుందా అని ఏజీ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ అక్కడకు వెళ్లాల్సి వస్తుందని, మరి వాళ్ల పిల్లల సంగతి ఏమవ్వాలని ఆయన నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement