కమల్‌నాథన్ కమిటీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల విభజనలో కమల్‌నాథన్ కమిటీ పనితీరు సరిగా లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ విమర్శించారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన చేయాల్సిన కమల్‌నాథన్ కమిటీ కాలయాపన చేస్తోందన్నారు.
జూన్ ఆఖరు నాటికి ఆంద్రప్రదేశ్ సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నా.. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కమల్‌నాథన్ కమిటీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల విభజనలో పునర్విభజన చట్టాన్ని తుంగలోతొక్కుతోన్న కమల్‌నాథన్ కమిటీపై గవర్నర్, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.